
గుంటూరు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో గుంటూరు జిల్లా జీజీహెచ్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన దీక్ష భగ్నం వార్త తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద గుమ్మిగూడటంతో పోలీసులు వారిపై లాఠీ ఝలిపించి వైఎస్ జగన్ను ఆస్పత్రి లోనికి తరలించారు.
తొలుత 108 వాహనం నుంచి స్ట్రెచర్పైకి మార్చిన పోలీసులు అనంతరం వీల్ చైర్లో కూర్చొబెట్టి ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యల పేరిట పోలీసులు వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేశారు.