వామపక్షాల ‘మున్సిపల్’ దీక్ష భగ్నం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పది వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేపట్టిన నిరాహార దీక్షలను బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న నేతలందరినీ బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కార్మికులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి, ఉద్రిక్తత నెలకొంది. చివరికి నేతలను పోలీసులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
దీనిపై ఆగ్రహించిన వామపక్షాలు ప్రభుత్వ తీరుకు నిరసనగా శుక్రవారం (ఈ నెల 17న) రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాయి. గురువారం (16న) నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ వామపక్షాల నాయకులు తమ్మినేని వీరభద్రం (సీపీఎం), చాడ వెంకట్‌రెడ్డి (సీపీఐ), సాధినేని వెంకటేశ్వర్‌రావు (న్యూడెమోక్రసీ, చంద్రన్న వర్గం), వేములపల్లి వెంకట్రామయ్య (న్యూడెమోక్రసీ, రాయల వర్గం), సురేందర్‌రెడ్డి (ఫార్వర్డ్‌బ్లాక్), జానకిరాములు (ఆర్‌ఎస్‌పీ), మురహరి (ఎస్‌యూసీఐ), భూతల వీరన్న (సీపీఐ ఎంఎల్) తదితరులు ఇందిరాపార్కు వద్ద నిరాహార దీక్షలో కూర్చుకున్నారు.
ఈ దీక్షలకు అనుమతి తీసుకోకపోవడం, దీక్షలకు సంఘీభావంగా రాష్ట్రంలోని 63 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి గురువారం కార్మికులు వేలాదిగా తరలిరావాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం సాయంత్రం పెద్ద సంఖ్యలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వామపక్షాల నేతలను అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. కార్మికులు, నాయకులు వారిని తీవ్రం గా ప్రతిఘటించడంతో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
కార్మికులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే భారీ సంఖ్యలో వచ్చిన పోలీసులు.. కార్మికులను పక్కకు తొలగించి నేతలను అరెస్ట్ చేసి గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బలహీనవర్గాలను పట్టించుకోరా..?
అంతకు ముందు సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాఘవులు దీక్షలను ప్రారంభించి, మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మున్సిపల్ కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. అగ్రకులాలు ఎక్కువగా ఉండి ఎక్కువ జీతాలు సంపాదించుకుంటున్న వారికి జీతాలు పెంచుతూ.. సమాజం ఈసడించుకునే పనిలో, బలహీనవర్గాలు అధికంగా ఉన్న మున్సిపల్ కార్మికుల వేతన సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజా జీవనం సజావుగా సాగడానికి శ్రమించే కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. సైన్యాన్ని, పోలీసులను దించి, ఎస్మా చట్టాన్ని ప్రయోగించి సమ్మెను అణిచివేయాలనే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులేమైనా దేశద్రోహులా, దురాక్రమణదారులా అని నిలదీశారు. కార్మికులతో తలపడితే అధికారాన్ని వదులుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ దీక్షలకు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, టీడీపీ నాయకుడు పెద్దిరెడ్డి, ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ తదితరులు సంఘీభావం ప్రకటించారు. కాగా.. సీఎం కేసీఆర్ సమస్యలను పరిష్కరించే బదులు మరింత జటిలం చేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. బంద్‌కు అన్ని సంఘాలు, వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాలు సహకరించాలని సీపీఎం నేత బి.వెంకట్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అణచివేత, నిర్భంధంతో సమ్మెను ఆపజాలరని సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ-చంద్రన్న) నేత కె.గోవర్ధన్ పేర్కొన్నారు.
ఎవరి దారిలో వారే!
* 90% మంది విధుల్లోకి: కమిషనర్
* కొనసాగుతోందన్న కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమ్మెపై ఇంకా ఎటూ తేలడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని, ఇంకా మొండికేస్తే ఆమరణ దీక్షలకు దిగుతామని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ స్పష్టం చేస్తుండగా.. దాదాపు 90 శాతం మంది కార్మికులు విధుల్లో చేరారని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. దాదాపు సమ్మె ముగిసిపోయినట్లేనని, కార్మికులంతా విధులకు వస్తున్నారని చెప్పారు.
విధులకు గైర్హాజరు కావడమే కాక విధుల్లో ఉన్న సిబ్బందిని అడ్డుకున్న 28 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకోవ డంతోపాటు ఐదుగురు ఎస్‌ఎఫ్‌ఏ(శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)లను తొలగించామన్నారు. హైదరాబాద్‌లో బుధవారం 3వేల టన్నులకుపైగా చెత్తను తరలించామని, మొత్తం చెత్తను గురువారం సాయంత్రంలోగా తరలిస్తామని పేర్కొన్నారు. మరోవైపు పోలీసులను వినియోగించి సమ్మెలో ఉన్న వారిని అరెస్టు చేశారని, మహిళా కార్మికులని కూడా చూడకుండా పోలీస్‌స్టేషన్లలో ఉంచారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బుధవారం దాదాపు 500 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నాయి.