- పాదయాత్ర జరిగి తీరుతుంది: ముద్రగడ
- ఎలా నిర్వహిస్తారు ?: మంత్రి రాజప్ప
- పలు ప్రాంతాల్లో పోలీసుల మోహరింపు
- ఎవరి ఏర్పాట్లలో వారు
ఉత్కంఠ
Published Tue, Nov 15 2016 12:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:19 PM
సాక్షిప్రతినిధి, కాకినాడ :
రాష్ట్ర ప్రభుత్వానికి కాపు ఉద్యమ సెగ మరోసారి తగలనుంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాపులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. కాపు ఉద్యమం తాజా పరిణామాలతో మరోసారి ఉత్కంఠగా మారింది. ఈసారి కోనసీమ వేదికగా నిలుస్తోంది. ఇదే డిమాండ్ సాధన కోసం కిర్లంపూడిలో తన స్వగృహంలో ముద్రగడ పద్మనాభం తలపెట్టిన దీక్షను ప్రభుత్వం పోలీసుల బలప్రయోగంతో రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించడం, అక్కడ దీక్ష కొనసాగించడం తెలిసిందే. ఆ పరిణామాల నేపథ్యంలో మలిదశ ఉద్యమంలో పాదయాత్రపై సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. మరో 48 గంటల్లో (ఈ నెల 16న) ఉదయం తొమ్మిది గంటలకు రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్ నుంచి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ యాత్ర కోనసీమలో పలు మండలాల మీదుగా అంతర్వేది పుణ్యక్షేత్రం వరకు ఐదు రోజులపాటు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. జేఏసీ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇందుకు అనుగుణంగా కోనసీమతోపాటు జిల్లావ్యాప్తంగా స్థానిక కాపు నేతలు ఊరూవాడా ప్రచారం చేస్తూ పాదయాత్రకు సమాయత్తమవుతున్నారు.
శాంతియుతంగా చేస్తుంటే అనుమతులెందుకు..?
గాంధీమార్గంలో శాంతియుతంగా తలపెట్టిన పాదయాత్రకు ముందస్తు అనుమతి అవసరం లేదని ముద్రగడ, అనుమతి లేకుండా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరిస్తున్నారు. పాదయాత్ర కొనసాగిస్తామని ముద్రగడ, అనుమతి పేరిట నిలువరించాలని ప్రభుత్వం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.పాదయాత్ర జరిగే కోనసీమ, ఇటు ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిని సోమవారం నాటికే పోలీసు బలగాలతో నింపేసింది. కాపు సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభించే రావులపాలెంను పోలీసులు అష్టదిగ్భంధనం చేసే పనిలో ఉన్నారు. రావులపాలేనికి వచ్చే మార్గాలన్నింటినీ పోలీసుల చెక్‌పోస్టులతో నింపేసింది. అటు పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం, ఇటు జొన్నాడ, మరోవైపు కొత్తపేట సహా రావులపాలెంకు వచ్చే రహదారులన్నింటినీ పోలీసు నియంత్రణలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ఆరువేల మంది పోలీసులను వినియోగిస్తుండగా, ఇప్పటికే సగానికిపైగానే బలగాలు కోనసీమలో మకాంచేసి ఉన్నాయి.
బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని కాపులను ఓట్‌బ్యాంకుగా వినియోగించుకుని ఇప్పుడు అదే కాపులపై పోలీసు బలగాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వంపై కాపు యువత అగ్గిమీద గుగ్గిలమవుతోంది. రావులపాలెం పాదయాత్ర విషయాన్ని గత అక్టోబరు మొదటి వారంలో కాపు జేఏసీ నేతలు ప్రకటించారు. పాదయాత్రకు సిద్ధమవుతున్న తరుణంలో కాపు కార్పొరేష¯ŒS చైర్మ¯ŒS చలమలశెట్టి రామానుజయ్యతో సమాంతరంగా కడపలో మరో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
చంద్రబాబు సూచనలు లేకుండా చలమలశెట్టి ఆ పాదయాత్ర చేపడతారా, కాపుల మధ్య చిచ్చుపెట్టి విభజించి పాలించే ప్రయత్నం కాక మరేమిటని కాపు నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ముద్రగడ ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యమాన్ని నీరుగార్చే కుట్రలో భాగమేనంటున్నారు. పిఠాపురంలో కాపుల మధ్య చిచ్చుపెట్టి రెండు వర్గాలుగా విభజించి పాలించడం ఇందుకు తాజా ఉదాహరణ అంటున్నారు. పిఠాపురంలో ఎప్పుడూ ఒకేచోట కలిసికట్టుగా ఒకే కాపు సమారాధన నిర్వహిస్తుండే వారు. అటువంటిది ఈ సారి ముద్రగడ సమారాధనకు వెళుతున్నారని తెలుసుకుని చంద్రబాబు డైరెక్షన్లో అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వర్మ కాపుల్లో చీలికపెట్టి పోటీగా సమారాధన నిర్వహించారని కాపు జేఏసీ నేతలు ఆక్షేపిస్తున్నారు. కాపుల్లో చీలిక తీసుకువచ్చినా ఉమ్మడి డిమాండ్ విషయంలో అంతా ఒకే గూటి పక్షులని ముద్రగడ పిఠాపురం సమారాధనలో పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వ ప్రతినిధిగా హోంమంత్రి చినరాజప్ప వాదన మరోలా ఉంది. సెక్ష¯ŒS–30 అమలులో ఉన్నప్పుడు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి అవసరమంటున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు. పాదయాత్రపై ఎవరి వాదనలు వారు విన్పిస్తూనే ఇటు కాపు జేఏసీ నేతలు, మరో పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇందులో ఎవరిది పై చేయి అవుతుందో వేచి చూడాల్సిందే.
మీ పాదయాత్రలకు ఎవరి అనుమతి తీసుకున్నారు
శాంతియుతంగా పాదయాత్ర చేస్తామని ముందు నుంచి చెబుతున్నా ప్రభుత్వం భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపును ఏమనుకోవాలని కాపు జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అనుమతి లేకుండా పాదయాత్ర కుదురదంటున్న హోంమంత్రి చినరాజప్పను గతంలో అనుమతి లేకుండా పాదయాత్రలు చేయలేదా అని కాపు నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గ్రామ,గ్రామాన నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలకు ఏ పోలీసు అధికారి అనుమతి తీసుకున్నారో చెప్పాలంటున్నారు. అంతెందుకు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో చంద్రబాబు నిర్వహించిన మహా పాదయాత్రకు ముందస్తు అనుమతి ఉందా అని కాపు జేఏసీ నేతల వాదిస్తున్నారు. రావులపాలెంలో పాదయాత్ర విషయాన్ని గత నెలలోనే ప్రకటించగా ఇప్పుడు హఠాత్తుగా అనుమతి కావాలని కోరడంలో ఆంతర్యమేమిటని కాపు నేతలు నిలదీస్తున్నారు.
Advertisement
Advertisement