సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోని 24 సర్కిళ్లలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సర్కిళ్లవారీగా డిమాలిషన్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. ఈమేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి శనివారం సాయంత్రం ఉత్తర్వు జారీ చేశారు. నగరంలోని అక్రమ నిర్మాణాలను.. ముఖ్యంగా చెరువులు, నాలాలపై నిర్మించిన వాటిని తొలగించేందుకు గట్టి చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తక్షణమే స్పందించిన కమిషనర్ చర్యలు చేపట్టారు.
డిమాలిషన్ స్క్వాడ్‌లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌తోపాటు సర్కిల్ పరిధిలోని తాసీల్దార్, అసిస్టెంట్ పోలీస్ కమిషనర్‌ను సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఈ స్క్వాడ్‌ల ఏర్పాటుతో పాటు వారికి అవసరమైన సిబ్బంది, వాహనాలు సమకూరుస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నాలాలు, చెరువుల ఆక్రమణల వల్లే ప్రస్తుత దుస్థితి అంటూ కమిషనర్, అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చినందున ఈ స్క్వాడ్‌లు వెంటనే రంగంలోకి దిగుతాయని తెలిపారు.
అక్రమ కట్టడాల సమాచారమివ్వండి..
నగరంలో నాలాలు, చెరువులు, శిఖం భూముల్లో అక్రమంగా నిర్మిం చిన కట్టడాల గురించి సమాచారం తెలిసిన వారు తమకు అందజేయాల్సిందిగా కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం తెలిపే వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్(040–21 11 11 11)కు తెలియజేయాలన్నారు.
కలెక్టర్లు, పోలీసు కమిషనర్లకు లేఖలు..
సర్కిళ్ల వారీగా ఏర్పాటు చేస్తున్న డిమాలిషన్ స్క్వాడ్‌లలో సంబంధిత తహసీల్లార్లు, సహాయక పోలీస్ కమిషనర్లను సభ్యులుగా నియమించాలని కోరుతూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల కలెక్టర్లకు లేఖలు రాసినట్లు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు.