మారియట్ హోటల్ వద్ద హుస్సేన్‌సాగర్ వరదను పరిశీలిస్తున్న మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి తదితరులు
కుత్బుల్లాపూర్: నాలాలపై వెలసిన అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని వర్షం ముంపు ప్రాంతాలను ఆయన శుక్రవారం మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొంపల్లి నుంచి వెన్నెలగడ్డ చెరువు వరకు ఉన్న నాలాను పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని జీడిమెట్ల కార్పొరేటర్ పద్మ భర్త కె.ఎం ప్రతాప్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇరిగేషన్ అధికారులతో సర్వే చేయించి సదరు అక్రమ నిర్మాణాలను తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎమ్మెల్యే వివేకానంద్, కార్పొరేటర్ పద్మ, స్థానిక అధికారులు దగ్గరుండి వీటిని గుర్తించి ఇరిగేషన్ అధికారులకు తెలపాలని ఆదేశించారు. వెన్నెలగడ్డ ఎన్నా చెరువును పరిశీలించిన అనంతరం గాయత్రినగర్, గోదావరి హోమ్స్, సుభాష్‌నగర్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో నాలాలను వారు పరిశీలించారు. ఆక్రమణకు గురైన నాలాలను గుర్తించి వెంటనే నిర్మాణాలు తొలగించాలని అక్కడే ఉన్న అధికారులకు హుకుం జారీ చేశారు. ఫాక్‌సాగర్ నాలా కబ్జాకు గురవుతోందని స్థానికులు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక వృద్ధురాలు అనసూయ వరద నీటి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఆయన వృద్ధురాలితో ముచ్చటిస్తూ... ‘మీ ఇంటికి వచ్చానమ్మా.. ఏం ఇస్తున్నావని’ అడిగారు. దీంతో ఆమె టీ ఇవ్వగా తాగి అక్కడ నుంచి బయలు దేరారు. మంత్రుల వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, నార్త్‌జోన్ కమిషనర్ శంకరయ్య, ఉప కమిషనర్ మమత, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, శాంతిశ్రీ తదితరులు ఉన్నారు.