
విధానాలు మారకుంటే సీఎంనే మార్చేస్తాం
మహాజన పాదయాత్ర సభలో తమ్మినేని వీరభద్రం
టేకులపల్లి: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రంలో పిచ్చి పాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇక నీ విధానాలు మార్చుకోకుంటే.. నిన్నే మార్చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. సీపీఎం మహాజన పాదయాత్ర గురువారం రాత్రి టేకులపల్లికి చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు చేసి.. ప్రాణాలు త్యాగం చేసినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బతుకులు మారితేనే రాష్ట్రం అభివృద్ధి సాధించినట్లని, సీఎం కేసీఆర్ చేప్పే కాకి లెక్కలతో అభివృద్ధి సాధ్యం కాదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల పరిస్థితి అలాగే ఉందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు.