
పెద్ద సార్లు లేకపోతే అంతే..!
జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల సమయపాలన కొరబడింది
♦ సమయపాలన పాటించని అధికారులు
♦ఇబ్బందులు పడుతున్న ప్రజలు
ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో అధికారుల సమయపాలన కొరబడింది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ క్యాంపు కార్యాలయాలకు అనుకొని ఉన్న ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయంలోని ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంతో సుదుర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ పని వేళలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సంబంధిత తహసీల్దార్ ఒక వేళ ఏదైనా మీటింగ్‌లకు వెళ్లితే చాలు వారి ఇష్టమైన సమయానికి వచ్చి వెళ్లిపోతున్నారనే ఆరోపనలు లేకపోలేదు.
ఉదయం 10.30 గంటలకు కారాయానికి రావాలి్సన సంబంధిత అధికారులు 11.30 గంటల తర్వాత కార్యాలయానికి వస్తున్నారు. అలాగే కొద్దీసేపు కార్యాలయంలో ఉండి మధ్యాహ్నం 1 గంటల, 1.30 గంటల సమయంలో భోజనానికి వెళ్లిన అధికారులు మూడున్నర, నలుగు గంటల సమయంలో కార్యాలయానికి వస్తున్నారని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వాపోతున్నారు. శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన అధికారులు 3.15 గంటల వరకు కూడా కార్యాలయంలో లేరు.
అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ సమయం, బస్సు ఛార్జీలు, కూలీ వృథా అవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్, జేసీలు నివాసం ఉండే ప్రాంతాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మారుమూల మండలాల పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందోనని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా...
తమ కార్యాలయ ఉద్యోగులు ప్రొద్దున వస్తారు. వివిధ పనుల నిమిత్తం తమ కార్యాలయానికి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చిన్నప్పుడు ఆలస్యంగా వెళ్తారు. అయిన్నప్పటికీ సమయ పాలన పాటించని అధికారులపై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి సమయ పాలన పాటించేలా చూస్తా.
– శ్రీదేవి, తహసీల్దార్, ఆదిలాబాద్ రూరల్