సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌రావు
పరిస్థితి చక్కబడే వరకు సెలవులు వద్దు
సమన్యయంతో సహాయక చర్యల్లో పాల్గొనాలి
జిల్లాలోని వర్షాలపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
సిద్దిపేట జోన్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున వర్షతీవ్రత తగ్గేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధిత శాఖల అధికారులకు సెలవులు మంజూరు చేయరాదని రాష్ర్ట నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు జేసీ వెంకట్రాంరెడ్డికి సూచించారు. శనివారం రాత్రి ఆర్డీఓ కార్యాలయంలో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ, రెవెన్యూ, ఆటవీ శాఖల అధికారులతో భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలపై మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం రాత్రిపూట పడుతున్న నేపథ్యంలో బుంగలు పడ్డ చెరువులకు గండి పడే అవకాశం ఉన్నందున పోలీసు, నీటి పారుదల శాఖ యంత్రాంగం సమన్వయంతో సహయక చర్యల్లో పాల్గొనాలన్నారు. చెరువుల వద్ద ఇసుక బస్తాలు కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. దెబ్బతిన్న రోడ్లకు తాత్కలిక మరమ్మతులు చేపట్టాలన్నారు. అలాగే ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధికారుల పనితీరు భేష్
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని అన్ని శాఖల పనితీరు ప్రసంశనీయమని మంత్రి సమీక్షలో అభినందించారు. ఇదే స్ఫూర్తితో సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వర్షం తగ్గిన వెంటనే పంట నష్టం అంచనా వేయలన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఆదనంగా నీరు వస్తుందని అదే విధంగా ఎగువ మానేరు డ్యాంలో నీరు పుష్కలంగా చేరి డ్యాం నిండిందన్నారు. ఈ నేపథ్యంలో రబీ సీజన్‌లో వరి సాగు పెరగనుందని అందుకు ఆవరసరమైన ప్రణాళికలు సిద్ధ చేయాలని అధికారులను అదేశించారు.
ఓపిక, సహనం ముఖ్యం
అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు ప్రతి అధికారికి ఓపిక సహనం ఎంతో ముఖ్యమన్నారు. ఆ దిశగా పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ భూసేకరణ పనులు నియోజకవర్గ కాళేశ్వర ప్రాజెక్ట్ పురోగతిని ఆరా తీశారు. సమీక్షలో జేసీ వెంకట్రాంరెడ్డి, నీటిపారుదల శాఖ సీఈ హరిరాం, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ అనంద్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు.