- నాడు తండ్రి.. నేడు తల్లి మృతి
- అనాథలైన చిన్నారులు
చికిత్స పొందుతూ మహిళ మృతి
Published Sat, Aug 27 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
పరకాల : ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పెండెల మౌనిక(29)కు వెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. రాజు అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రులు చుట్టూ తిరిగారు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఐదేళ్ల క్రితం రాజు మృతిచెందాడు. అప్పటి నుంచి మౌనిక తన ఇద్దరు పిల్లలను తీసుకొని వచ్చి పులిగిల్లలోనే నివాసముంటోంది. తల్లిదండ్రులు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేసుకుంటున్నారు.
భర్త రాజును ఆస్పత్రిలో చూపించడానికి చేసిన అప్పులతోపాటు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎక్కువయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలని మనోవేదనకు గురైన మౌనిక ఈ నెల 20న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిదండ్రుల మృతితో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
Advertisement