మక్క బుట్టలకూ గిరాకే
-
బట్టీల్లో పెరిగిన బుట్టల వినియోగం
-
గంపకు రూ.70 వెచ్చించి కొనుగోలు
బాల్కొండ:
రైతు సాగు చేసిన ప్రతి వస్తువూ ఉపయోగకరమే. ఒకప్పుడు మొక్కజొన్న నూర్పిడి తర్వాత వచ్చే బుట్టను వంటకు ఉపయోగించే వారు. తమకు అవసరమైనంత మేరకు ఉంచుకొని మిగతాది తెలిసిన వారికి ఇచ్చే వారు. అయితే, సిలిండర్ల వాడకం పెరిగిపోయిన నేపథ్యంలో మక్క బుట్టల వినియోగం చాలా తగ్గింది. అయితే, ఇప్పుడదే బుట్టకు వ్యాపారుల నుంచి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో బుట్ట గంప రూ.70 పలుకుతోంది. ఖరీఫ్‌లో సాగు చేసిన మొక్కజొన్న పంటను ప్రస్తుతం నూర్పిడి చేస్తున్నారు. బుట్ట నుంచి వేరు చేసిన మక్కలను విక్రయిస్తున్నారు. అయితే, బుట్టకు కూడా డిమాండ్ ఏర్పడడంతో దాన్నీ విక్రయిస్తున్నారు. మన జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యాపారులు బాల్కొండ మండలానికి వస్తున్నారు. గ్రామాల్లో సంచరిస్తూ బుట్ట గంపకు రూ.70 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
ప్యాలాలు, అటుకుల తయారీ బట్టీలో ఈ బుట్టలను వినియోగిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. వడ్ల నుంచి ప్యాలలు, బియ్యం నుంచి అటుకులు, మక్కల నుంచి మక్క ప్యాలాలు తీయడానికి వంట చెరుకు చాలా అవసరం. అయితే, వంట చెరుకు స్థానంలో మక్క బుట్టలు వినియోగిస్తున్నారు. దీంతో బుట్టలకు మంచి గిరాకీ ఏర్పడింది. వ్యాపారులు గ్రామాలకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ రూ.70లకు ఒక్కో గంప కొంటున్న వ్యాపారులు.. రూ.120 చొప్పున ప్యాలాల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మొక్కజొన్న కంకులు నూర్పిడి చేయడం వలన మక్క బుట్టలు వస్తాయి. ప్రస్తుతం సిలిండర్ వాడకం ఎక్కువ కావడం వలన మక్క బుట్టలను రైతులు వినియోగించడం లేదు. అయితే, ఈ బుట్టలను పసుపు ఉడికించే యంత్రాల్లో వినియోగించ వచ్చు. కానీ కూలీలు వాటిని వాడకపోవడంతో ఇలా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఇలా రైతులకు ఎంతో కొంత ఆదాయం కలిసి వస్తోంది.
బట్టీల్లో విక్రయిస్తాం
రైతుల నుంచి మక్క బుట్టలు కొనుగోలు చేసి ప్యాలాలు, అటుకుల బట్టీలకు విక్రయిస్తాం, కొన్నిసార్లు లాభాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టం వస్తుంది.
– అమర్ సింగ్, వ్యాపారి, పిట్లం
డిమాండ్ ఎక్కువగా ఉంది
మక్క బుట్టలకు ఎక్కువ డిమాండ్ ఉంది. అందుకే గ్రామాల్లో తిరుగుతూ బుట్టలను కొనుగోలు చేస్తున్నాం. గంపకు రూ.70 పెడుతున్నాం. రైతులు అధికంగానే విక్రయిస్తున్నారు.
– బాలుసింగ్, వ్యాపారి, పిట్లం