రంగాలవారీగా రాజధాని అభివృద్ధి
♦ రాజధానిలో పరిపాలన, ఆధ్యాత్మిక, పర్యాటక, క్రీడా తదితర నగరాల నిర్మాణం
♦ ఏ గ్రామంలో ఏ నిర్మాణం అనేదానిపై స్పష్టమైన ప్రతిపాదనలు
♦ ఐదు దశల్లో పది విభాగాల పూర్తికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన సర్కారు
సాక్షి, విజయవాడ బ్యూరో: కొత్త రాజధాని అమరావతి దశ, దిశను నిర్దేశించడంలో పది ప్రాధాన్యతలను గుర్తించి దశలవారీగా నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాజధాని గ్రామాలను పరిపాలన, విద్య, వైద్యం, ఆధ్యాత్మిక, క్రీడలు, టూరిజం తదితర రంగాల్లో ప్రత్యేక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో కొన్నింటికి మాత్రమే కీలక నిర్మాణాలను పరిమితం చేశారు. మిగిలిన గ్రామాలకు సంబంధించి ఏ గ్రామంలో ఏ ప్రత్యేక విభాగం అభివృద్ధి చేయనున్నది తాజాగా గుర్తించారు. మొత్తం ఐదు దశల్లో పది విభాగాల అభివృద్ధికి సర్కారు కార్యాచరణ రూపొందించింది. వివరాలివీ..
► రాయపూడి ప్రాంతంలో రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, శాఖల కమిషరేట్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ క్వా ర్టర్స్, ప్రభుత్వ అతిథిగృహాలను నిర్మిస్తారు.
► అనంతవరాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తారు.
► కృష్ణాయపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులతోపాటు ప్రత్యామ్నాయ వైద్య విధానం, వైద్య సంస్థలు, అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రుల(మెడికల్ సిటీ)ను ఏర్పాటు చేస్తారు.
► ఐనవోలులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, వృత్తివిద్యా కళాశాలలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, టెక్నాలజీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు, బిజినెస్ స్కూల్స్, బేసిక్ ఆర్ అండ్ డి సంస్థలు(విద్యా నగరం) నిర్మాణానికి ప్రతిపాదించారు.
► ఉండవల్లిలో ఐకాన్ టవర్లు, వంతెనలు, మ్యూజియంలు, రివర్ ఫ్రంట్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్(పర్యాటక నగరం)ను అభివృద్ధికి ప్రతిపాదన చేశారు.
► అబ్బిరాజుపాలెంను స్పోర్ట్స్ యూనివర్సిటీ, అథ్లెటిక్స్ స్టేడియాలు, స్పోర్ట్స్ అకాడమీలు, ఆక్వాటెక్ స్టేడియాలు, మల్టీపర్సస్ స్టేడియాలు, ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్‌కోర్స్ నిర్మాణాలతో క్రీడానగరంగా తీర్చిదిద్దే ప్రతిపాదన చేశారు.
► ఉద్ధండరాయునిపాలెంలో ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులతోపాటు ఇంటర్నేషనల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్, ఇన్సూరెన్స్ సంస్థల(ఆర్థిక నగరం)ను ఏర్పాటు చేస్తారు.
► నేలపాడులో హైకోర్టు, ట్రిబ్యునళ్లు, న్యాయ యూనివర్సిటీ, న్యాయసంస్థలు, లోకాయుక్త ప్రధానమైన సంస్థల(న్యాయ నగరం)ను ఏర్పాటు చేస్తారు.
► శాఖమూరులో పరిశోధన, అభివృద్ధి, ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్ రీసెర్స్, బయోటెక్, మెడికల్ రీసెర్చ్‌తోపాటు టెక్నాలజీ ఇంక్యుబేటర్స్(నాలెడ్జ్ సిటీ) ఏర్పాటు చేస్తారు.
► బేతపూడిలో సెల్యులర్ ఫోన్లు, ఆడియో, వీడియో అప్లయన్సెస్, సౌరశక్తి ఉత్పాదన సామాగ్రి, సెమీ కండక్టర్లు, సెన్సర్లు, గృహోపకరణాలు తయారు(ఎలక్ట్రానిక్స్ సిటీ) వంటివి ఏర్పాటు చేయనున్నారు.