బెల్లంపల్లిని జిల్లా చేయూల్సిందే | The district Bellampalli proposal | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లిని జిల్లా చేయూల్సిందే

Published Thu, Jun 23 2016 8:00 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

బెల్లంపల్లిని జిల్లా చేయూల్సిందే

బెల్లంపల్లిని జిల్లా చేయూల్సిందే

ప్రజాభిప్రాయ సేకరణలో నినదించిన ప్రజలు
 

బెల్లంపల్లి/బెల్లంపల్లి రూరల్ : తూర్పు ప్రాంతం కూడలిలో ఉన్న బెల్లంపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కొత్త జిల్లా ఏర్పాటుకు బెల్లంపల్లి మాత్రమే అనువైన ప్రాంతమని, బెల్లంపల్లి జిల్లా కోసం ప్రభుత్వానికి తగిన నివేదిక పంపించాలని పెద్ద పెట్టున నినదించారు. బుధవారం బెల్లంపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మం దిరంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్‌లు, మండలాల విభజన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఆరీ ్డవో ఆయేషామస్రత్‌ఖానం అధ్యక్షత వహిం చారు. ప్రజాభిప్రాయ సేకరణ ఆధ్యంతం భావోద్వేగం, ఆగ్రహావేశాల మధ్య జరిగింది.


నిప్పులు చెరిగిన గుండా మల్లేశ్
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు. విధి, విధానాలు, మార్గదర్శకాలు లేకుండా ప్రభుత్వం మంచిర్యాలను జిల్లా చేస్తామని ప్రకటిచండంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏకపక్షంగా జిల్లాల పేర్లను ప్రకటించడం ఆక్షేపణీయమన్నారు. బెల్లంపల్లి పేరును కొత్త జిల్లా కోసం కలెక్టర్ ప్రతిపాదించినా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం సరికాదన్నారు. శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల విభజన జరగడం లేదన్నారు. బెల్లంపల్లిని జిల్లా చేయడంతో చుట్టు పక్కల ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిపాలన సౌలభ్యం ఏర్పడుతుందన్నారు.

ప్రభుత్వం రూపొందించిన మ్యాప్‌లో మధ్యస్తంలో ఉన్న బెల్లంపల్లి కనిపించడం లేదా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ తీరుగా చూసినా ప్రభుత్వం బెల్లంపల్లిని జిల్లాగా ప్రకటించాల్సిందేనన్నారు. మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లు ప్రకటించడం సరికాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ జరపడం సరికాదన్నారు. ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి ఎస్.కృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి చిప్ప నర్సయ్య, జెడ్పీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్, బీజేపీ నాయకులు సకినాల నారాయణ, రాజమల్లు, మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కటకం సతీశ్, బెల్లంపల్లి జిల్లా సాధనోద్యమ సమితి నాయకులు నీరటి రాజన్న తదితరులు మాట్లాడుతూ, కొత్త జిల్లా ఏర్పాటుకు మంచిర్యాలకు ఉన్న అర్హతలేమిటి, బెల్లంపల్లికి ఉన్న ప్రతికూల అంశాలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

బెల్లంపల్లిని జిల్లాగా సాధించుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టి, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అంతకుముందు బెల్లంపల్లి జిల్లా చేయాలని కోరుతూ అఖిలపక్షం, రాజకీయ పక్షాలు, వ్యాపార, వాణిజ్యవర్గాలు పోటాపోటీగా ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానంకు వినతిపత్రాలు అందజేశారు.


 బెల్లంపల్లి జిల్లా భావన వ్యక్తమైంది : ఆర్డీవో
బెల్లంపల్లిని జిల్లాగా ఏర్పాటు చేయాలనే భావన ప్రజాభిప్రాయ సేకరణలో సంపూర్ణంగా వ్యక్తమైందని మంచిర్యాల ఆర్డీవో ఆయేషామస్రత్‌ఖానం తెలిపారు. ఆమె మాట్లాడుతూ, కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన కోసం ప్రభుత్వం కసరత్తును ప్రారంభించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వివరిం చారు. బెల్లంపల్లి తహశీల్దార్ కె.శ్యామలదేవి, ఎంపీడీవో మహేందర్, రాజకీయ, ప్రజా, కుల, కార్మిక, వ్యాపార తదితర సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement