సబ్సిడీకి రాళ్లు..
►విత్తన కాయలలో దర్శనమిచ్చిన వైనం
►అధికారులు, కాంట్రాక్టర్ల, ఏజెన్సీలు కుమ్మక్కే దీనికి కారణం
►వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటున్న రైతాంగం
ఇదేంటి సబ్సిడీకి ప్రభుత్వం రాళ్లు ఇస్తోందంటే నమ్మశక్యంగా లేదు కదూ.. నమ్మకుండా పోయేదానికి వీల్లేదు.. ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఉంది. అవేవో ఉంగరాలకు వేసుకొనే రాళ్లు అనుకుంటే పొరపాటే.. ప్రభుత్వం సబ్సిడీ కింద అందజేస్తున్న వేరుశనగ విత్తన కాయల్లో రాళ్లు దర్శనమిచ్చాయి. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కణిక, గులకరాళ్లు, చెక్కలు, కేవలం 30కేజీల బస్తాకు కేజీకి పైగా వస్తున్నాయి
వేంపల్లె : మంగళవారం రాత్రి పదును వర్షం పడటంతో వేంపల్లె మండలం రామిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేఖరరెడ్డి, విశ్వనాథరెడ్డి మరికొంతమంది రైతులు విత్తన పప్పు ఆడించడానికి మిషన్‌కు తరలించారు. ఈ సమయంలో బస్తాలు విప్పి చూడగా రాళ్లు కనిపించాయి. 30కేజీల బస్తాకు కేజీకిపైగా రాళ్లు వచ్చాయి. వీటిని మిషన్‌లో వేస్తే విత్తన పప్పు పాడైపోతుందని యంత్రాల నిర్వాహకులు సలహా ఇచ్చారు. దీంతో వాటిని వ్యాపారులకు విక్రయించి,నాణ్యమైనవి తీసుకునే ప్రయత్నం చేశారు. వ్యాపారులను ఫోన్‌లో సంప్రదించగా సబ్సిడీ విత్తనకాయలకు బహిరంగ మార్కెట్‌లో దొరికే ఇతర కాయలకు తేడా లేదని, తక్కువ రేటుకు తీసుకుంటామని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రాళ్లను తొలగించి విషన్ వేయించి విత్తన పప్పును తీసుకెళ్లామని రైతులు తెలిపారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు కావడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతోందని వారు వాపోయారు.
మొగ్గు చూపని రైతులు.. :
వేరుశనగ సాగు చేయాలంటే ప్రస్తుతం సాహసోపేతమైన నిర్ణయమే. ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ కావడంతో రైతులు మొగ్గు చూపే పరిస్థితి కనిపించడంలేదు. వేంపల్లె మండలానికి 2800 క్వింటాళ్లు మంజూరయ్యాయి. ఈనెల 1 నుంచి పంపిణీ చేస్తున్నారు. వీటిని రైతులు అరకొరగా తీసుకెళుతున్నారు. నాణ్యత డొల్ల కావడంవల్ల నమ్మకం లేక తీసుకెళ్లలేదని తెలుస్తోంది.
బహిరంగ మార్కెట్‌కంటే తేడా లేదు..
ధరల విషయానికొస్తే బహిరంగ మార్కెట్‌లో వేరుశనగ కాయలకు.. ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్న ధరలకు పెద్ద తేడా లేకపోవడంతో రైతులు ముందుకు రావడంలేదు. గ్రేడింగ్ విధానంలో నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా విత్తన కాయలు పంపిణీ చేయడంతో అన్నదాతకు నమ్మకం కలగడంలేదు. బస్తా విప్పితే కానీ.. కాయలు సరిగా ఉన్నాయా.. లేదో తెలియని పరిస్థితి. 30కేజీల బస్తా పూర్తి ధర రూ.2,310 ఉండగా.. సబ్సిడీపోను రూ.1380లు చెల్లించాల్సి వస్తోంది. ఆటో, ఇతర ఖర్చులు కలిపి రూ.1500ల దాకా రైతులపై భారం పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో కూడా రూ.2,400 నుంచి రూ.2,500 వరకు బస్తా ధర ఉంది. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన విత్తన కాయలు కొనుగోలు చేసే వీలు ఉంది. సబ్సిడీ విత్తన కాయల్లో వారు ఇచ్చిన వాటిని మాత్రమే తీసుకోవాలి. పేరుకు మాత్రం సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను ప్రభుత్వం మంజూరు చేస్తోందని రైతులు మండిపడుతున్నారు.
నాణ్యత డొల్ల.. :
కరువు పరిస్థితుల నేపథ్యంలో కష్టాలు పడుతున్న రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కాయల్లో కూడా నాణ్యత డొల్లగా ఉంది. సాధారణంగా ఆయా కాంట్రాక్టర్లు ఇచ్చే విత్తన కాయలను అధికారులు పరిశీలించిన తర్వాతనే ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయకుండానే ఇష్టం వచ్చినట్లు బస్తాల్లో నింపడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అన్నదాతకు శఠగోపం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.