రైతుల రుణమాఫీ కోసం పోరాటం | The fight for the farmers loan waiver | Sakshi
Sakshi News home page

రైతుల రుణమాఫీ కోసం పోరాటం

Published Thu, Nov 3 2016 1:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

రైతుల రుణమాఫీ కోసం పోరాటం - Sakshi

రైతుల రుణమాఫీ కోసం పోరాటం

కామారెడ్డి :  రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ మోసం చేశాడని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. రుణమాఫీ అయ్యేదాక కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. బుధవారం కామారెడ్డిలోని సత్యగార్డెన్‌లో నిర్వహించిన రైతుగర్జన సభలో ఆయన మాట్లాడారు. 74 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి బతుకుతుంటే వారి కష్టాలను పట్టించుకోకుండా వాస్తుపేరిట సెక్రటేరియట్‌ను కూలగొట్టడానికి పూనుకున్నాడని ఆరోపించారు. రైతుల రుణమాఫీకి అవసరమైన డబ్బులు లేవనే సీఎం సెక్రటేరిట్ నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తాడని ప్రశ్నించారు. సీఎం ఫామ్ హౌజ్‌కే పరిమితమై మంత్రులు, ఎమ్మెల్యేలకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ పట్టించుకుంటాడన్నారు.

అరవై ఏండ్లలో రాష్ట్ర అప్పులు రూ. 60 వేల కోట్లు అయితే, కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్ర ప్రభుత్వం 70 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఉద్యోగాలని ఊరించి నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని దుయ్యబట్టారు. 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకుండా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. కమీషన్ల కోసమే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తున్నాడని అన్నారు. రైతులు పండించిన ధాన్యం, సోయా, మక్క పంటలకు సరైన ధరలు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ దిక్కులేదని, కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకున్నాడన్నారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందిన ఎందరో అనేక కష్టాల్లో ఉంటే బతుకమ్మ పేరుతో ఎంపీ కవిత తొమ్మిది దేశాలు తిరిగొచ్చారే తప్ప, గల్ఫ్‌లో ఇబ్బందులు పడుతున్న వారిని పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దళితుల భూములను ఆక్రమించుకున్నాడని, ఇప్పుడు గుట్టలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. అధికారులకు టార్గెట్లు విధించి అధికార పార్టీ నేతలు వసూలు చేసుకుంటున్నారని ఆరోపించారు.

కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన నేపథ్యంలో జిల్లాలోని ఏ నియోజక వర్గానికి చెందిన వారైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తన ఇంటిలో వసతులు కల్పిస్తానని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఎవరికి ఏ కష్టమొచ్చినా పార్టీ అండగా ఉంటుందన్నారు. పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు. సభలో మాజీ ఎంపీ సురేశ్‌షెట్కార్, మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్, పార్టీ నేతలు కాసుల బాల్‌రాజు, నల్లమడుగు సురేందర్, ప్రతాప్‌రెడ్డి, జమునా రాథోడ్, కైలాస్ శ్రీనివాస్, నిమ్మ మోహన్‌రెడ్డి, ఎల్.నర్సింగ్‌రావ్, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, నల్లవెల్లి అశోక్, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్, పండ్ల రాజు, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, తాన్‌సింగ్, పంపరి శ్రీనివాస్, భీంరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, తిర్మల్‌గౌడ్, తిరుపతిగౌడ్, నర్సాగౌడ్, పూల్‌చంద్,  తదితరులు పాల్గొన్నారు.

సఫాలా కర్మాగారాన్ని అడ్డుకోవాలని వినతి...
బ్రహ్మాజీవాడి శివారులో ఏర్పాటు చేయతలపెట్టిన సఫాలా కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ఎంతో నష్టం జరిగే ప్రమాదం ఉందని, దాన్ని అడ్డుకోవాలని గ్రామస్తులు షబ్బీర్‌అలీకి వినతిపత్రం అందజేశారు. అలాగే గల్ఫ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేత ఎర్రం రాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement