హైకోర్టు కట్టడానికి డబ్బుల్లేవు
- అందువల్ల నిర్మాణానికి సమయం పడుతుంది
- ఈ విషయంలో తెలంగాణ వైఖరి సరికాదు
- హైకోర్టు విభజన కేంద్రం పరిధిలో లేదు
- చట్టప్రకారం సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిదే
- విజయవాడలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: పునర్విభజన చట్టంలో తమకు కావాల్సిన వాటిని అమలు చేయాలంటున్న తెలంగాణ ప్రభుత్వం అవే చట్టంలో ఉన్న మిగిలిన అంశాలను మాత్రం కాదంటోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ పద్ధతి సరికాదని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. తెలంగాణతో గొడవ పడడానికి తాను సిద్ధంగా లేనని, అది ఉపయోగం లేదన్నారు. చైనా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న ఆయన శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. హైకోర్టు కట్టడానికి స్థలం ఉంది కానీ డబ్బులు లేవన్నారు. రైతులు భూమి ఇచ్చారని.. దాన్లో నిర్మాణాలు చేసేందుకు మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలి కదా అని ప్రశ్నించారు. హైకోర్టును ఐకానిక్ భవనంగా కట్టాలనుకుంటున్నామని.. దానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా తమదేనంటున్నారని చెప్పారు. కూర్చుని చర్చించుకునేందుకు ప్రయత్నాలు చేశానని.. అయినా నీళ్లు, పదో షెడ్యూల్‌లో ఉన్న ఆస్తుల విషయంలో ఏదీ జరగలేదన్నారు. కేసీఆర్, తానూ కూర్చుని మాట్లాడుకుంటే ఏమవుతుందని ప్రశ్నించిన ఆయన చట్టప్రకారం రెండు రాష్ట్రాల సమస్యలను కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో లేదని, సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్నారు. హైదరాబాద్‌లో అన్నీ వదులుకుని వచ్చిన వాడిని.. కోర్టును కూడా వదులుకుంటే ఏమవుతుందని ప్రశ్నించారు.కాగా రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఎందుకో ముందుకు రావట్లేదన్నారు.
కేంద్రం ఇంకా రూ.1,500 కోట్లే ఇస్తామంటోంది
ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలసి రాజధానికి నిధులివ్వాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. రాజధానికి మొత్తంగా రూ.2,500 కోట్లు ఇస్తామంటున్నారని, గతంలో విజయవాడ, గుంటూరు నగరాలకిచ్చిన వెయ్యికోట్లనూ అందులో కలిపి చెబుతున్నారన్నారు. ఇంకా రూ.1,500 కోట్లు ఇస్తారని, అవి రాజధానిలో తాము కట్టే 400 కేవీ విద్యుత్ టవర్స్‌కు సరిపోతాయని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాము కేంద్రాన్ని నిధులు అడుగుతామన్నారు. రాజధాని నిర్మాణంకోసం రుణాలకోసం ప్రయత్నిస్తామని, ఎక్కడ అవకాశముంటే అక్కడికెళ్లి అడుగుతామని చెప్పారు.
తాను కేంద్రంపై పోరాడనని, సమస్యలపై పోరాడతానని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా వైఎస్సార్‌సీపీ పొంతనలేని విమర్శలు చేస్తోందని, సీబీఐ విచారణ అడుగుతోందని మండిపడ్డారు. సీబీఐ విచారణ వేస్తే ఈ వ్యవహారాన్ని కంపు చేయాలని చూస్తోందని ఆరోపించారు.ఐదురోజుల చైనా పర్యటన ఫలప్రదమైందని, పెట్టుబడులే ధ్యేయంగా పలు నగరాల్లో పర్యటించామని చంద్రబాబు తెలిపారు. ఇతర దేశాల్లో ఏపీని ఒక రాష్ట్రంగా కూడా చూడట్లేదని, తనను చూసి హైదరాబాద్‌ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. దేశంలో చైనాకు చెందిన 500 కంపెనీలు పని చేస్తున్నాయని, వాటిద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా చైనా పర్యటన, జరిగిన ఒప్పందాల గురించి ఆయన వివరించారు. కడపలో ఆన్‌స్టీల్ కంపె నీ రూ.మూడువేల కోట్లతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకొచ్చిందని, బ్రహ్మణి స్టీల్స్‌కు గతంలో కేటాయించిన స్థలాన్ని దానికిస్తామని చెప్పినట్లు తెలిపారు.