
నోటిఫికేషన్ వద్దని చెప్పలేం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుత దశలో అటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్లను తొలగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరుపుతున్నందున, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకునేలా అధికారులకు సూచనలు చేయాలని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డికి హైకోర్టు స్పష్టం చేసింది. ఒక్కో వార్డులో బీసీ ఓటర్ల ఖరారు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని అటు జీహెచ్‌ఎంసీని, ఇటు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిమిత్తం బీసీ ఓటర్ల జాబితాను లెక్కించి వార్డులను ఖరారు చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోందని, అయితే 6.5 లక్షల ఓటర్ల తొలగింపును పరిగణనలోకి తీసుకోవడం లేదని, తొలగించిన ఓటర్ల విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు వార్డుల ఖరారుపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ టీడీపీ కార్యదర్శి ఫిరోజ్‌ఖాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి విచారించారు.
వార్డుల ఖరారు సరికాదు: న్యాయవాది మూర్తి
పిటిషనర్ తరఫు న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ.. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన 6.5 లక్షల మందిని తొలగించారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరుపుతోందన్నారు. తొలగించిన ఓటర్లను తిరిగి ఓటర్ల జాబితాలో చేరిస్తే వార్డుల ఖరారు విషయంలో మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే బీసీ ఓటర్ల జాబితాను రూపొందించి వార్డుల ఖరారుకు ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు.
కాబట్టి నోటిఫికేషన్ జారీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరుపుతున్న విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసునని, కాబట్టి ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేస్తుందని భావిం చడం లేదని అన్నారు. కాబట్టి ప్రస్తుత దశలో నోటిఫికేషన్ జారీ చేయకుండా ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు.