చోరీ కేసు నిందితుడి ఆత్మహత్యాయత్నం
Published Sat, Aug 27 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
సీరోలు(కురవి) : దొంగతనం కేసులో పోలీసులు కొడతారనే భయంతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మండలంలోని సీరోలు గ్రామంలో శుక్రవారం జరి గింది. పోలీసులు, నిందితుడి భార్య మల్లమ్మ, కుమారుడు ఉపేందర్ కథనం ప్రకారం.. సీరోలు గ్రామానికి చెందిన బోనాల రాంమూర్తి 24వ తేదీన కోళ్లు దొంగిలించాడంటూ అదే గ్రామానికి చెందిన ఈర్ల మైసయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో గురువారం రాంమూర్తిని సీరోలు పోలీసులు స్టేషన్‌కు పిలిపించి దుస్తులు విప్పి కూర్చోబెట్టారు. దీంతో తనను పోలీసులు కొడతారనే భయంతో వణికిపోయాడు. పుష్కరాల విధులకు వెళ్లి స్టేషన్‌కు చేరుకున్న ఎస్సై ప్రవీణ్‌కుమార్ అతడిని దొంగతనం చేశావా? అని విచారించగా తాను చేయలేదని సమాధానమిచ్చాడు.
దీంతో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జమానత్ ఇవ్వడంతో రాంమూర్తిని ఇంటికి పంపించారు. శుక్రవారం మళ్లీ ఎలాగైనా పోలీసులు స్టేషన్‌కు పిలిపిస్తారని, కొడతారనే భయంతో మనోవేదనకు గురైన రాంమూర్తి చేను వద్ద పురుగుల మందు తాగాడు. దీంతో అపస్మారకస్థితికి చేరుకునేలోపు చేను వద్దే ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటీన మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై సీరోలు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఐదు కోళ్లు పోయాయని మైసయ్య అనే వ్యక్తి రాంమూర్తిపై ఫిర్యాదు చేశాడని తెలిపారు. తాను ఆ సమయంలో పుష్కరాల విధుల్లో ఉన్నానని, స్టేషన్‌కు వచ్చాక విషయం తెలుసుకొని జమానత్‌పై రాంమూర్తిని ఇంటికి పంపించినట్లు తెలిపారు. అతడిని ఎవరూ కొట్టలేదని, కొట్టే ఆలోచన కూడా లేదన్నారు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఉంటాడని తెలిపారు.
Advertisement
Advertisement