గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాలకు అధికారులు సెక్యూరిటీ గార్డులతో భద్రత ఏర్పాటు చేశారు.
జిల్లాలో 25 పాఠశాలల వద్ద సెక్యూరిటీ గార్డుల నియామకం
ఏటూరునాగారం : గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాలకు అధికారులు సెక్యూరిటీ గార్డులతో భద్రత ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐటీడీఏ పరిధిలో ని 25 ఆశ్రమ పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు ఇద్దరు చొప్పున 50 మందిని ఔట్‌సోర్సింగ్ పద్ధతిన నియామకం చేశారు. కరీనంగర్ జిల్లాకు చెందిన ప్రైవేటు డెల్టా సెక్యూరిటీ కంపెనీకి గిరిజన సంక్షేమ శాఖ గార్డుల నియామకం టెండర్లను అప్పగించింది.
తల్లిదండ్రులకు గుర్తింపు కార్డులు
పాఠశాలలో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులకు గిరిజన సంక్షేమ శాఖచే జారీ చేయబడిన గుర్తింపు కార్డులను సిబ్బంది అందజేశారు. తల్లిదండ్రుల ఫొటో, పూర్తి అడ్రస్, ఫోన్ నంబర్‌తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సెల్ నంబర్‌ను కూడా గుర్తింపు కార్డుపై నమోదు చేశారు. అదేవిధంగా విద్యార్థినుల కదలికలను పసిగట్టేందుకు నూతనంగా మూమెంట్ రిజిస్టర్లను ప్రవేశపెట్టారు.
త్వరలో సీసీ కెమెరాల ఏర్పాటు
జిల్లాలోని బాలికల ఆశ్రమ పాఠశాలల్లో పదిహేను రోజుల్లోగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు గిరిజన విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అలాగే మరో 52 గిరిజన విద్యాసంస్థల్లో కూడా విజిటర్ రికార్డు, తల్లిదండ్రులకు గుర్తింపు కార్డులు, మేన్ గేట్ల వద్ద వాచ్‌మెన్ల ఏర్పాటుకు ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు వారు తెలియజేశారు.
24 గంటల పాటు విధులు
ఆశ్రమ పాఠశాలల్లో ఎరౌండ్ ద క్లాక్ విధులను ప్రవేశపెడుతున్నాం. పాఠశాలలో పని చేస్తున్న సిబ్బందిలో ప్రతి రోజు ఓ ఉద్యోగి 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ పాఠశాల పరిసరాలను అనుక్షణం గమనించేలా ఏర్పాట్లు చేశాం. ఇక నుంచి ఏ విద్యార్థిని అయినా అనుమతి లేనిదే బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం.
- పోచం, గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్,
ఐటీడీఏ ఏటూరునాగారం.