- కేంద్రానిది కో ఆపరేటివ్ ఫెడరిలిజం
- బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు
హన్మకొండ(వరంగల్ జిల్లా)
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు ఆరోపించారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విపక్ష పార్టీల నాయకులను బెదిరించి, ప్రలోభపెట్టి, ఫిరాయింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కనుమరుగవుతున్నాయని, ఈ క్రమంలో బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.
టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సిద్ధాంత బేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలు కోరుకుంటోందని, తమ పార్టీ అందుకు వ్యతిరేకమని చెప్పారు. కేంద్రం కో ఆపరేటివ్ ఫెడరిలిజంతో ముందుకు పోతోందన్నారు. ప్రపంచ స్థాయిలో ఆర్థికమాంద్యం నెలకొందని, అభివృద్ధి రేటు తగ్గుతోందని, అమెరికాలాంటి దేశంలోనూ వృద్ధి రేటు తగ్గిందని, ఈ సమయంలో దేశంలో అభివృద్ధి రేటు పెరుగుతోందని వివరించారు. మోదీ పర్యటన రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయనుందన్నారు. ఎంసెట్-2 ప్రశ్నాపత్రాల లీకేజీకి విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి బాధ్యత వహించాలని మురళీధర్‌రావు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఎంసెట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని విమర్శించారు.