సమ్మెను విజయవంతం చేయాలి
-
శ్రమ దోపిడీకి పాల్పడుతున్నప్రభుత్వాలు
-
కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి
-
ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి
హన్మకొండ : కార్మికుల సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ 2న కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ పరిస్థితులు, ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై కార్మిక సంఘాలన్నీ పోరాడేందుకు ఏకమయ్యాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 6వ పే కమిషన్ 54 శాతం ఫిట్‌మెంట్ ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం వేసిన 7వ పే కమిషన్ కేవలం 23.5 శాతం మాత్రమే ఇచ్చిందని, ఫిట్‌మెంట్ పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ జరగాలని, కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.16వేలు చెల్లిం చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడాన్ని ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలన్నా రు. సింగరేణ సంస్థ సంక్షోభంలోకి నెట్టివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్ట్రేలి యా, ఇండోనేషియా వంటి దేశాల నుంచి బొగ్గు దిగుమతి కావడంతో లోకల్ బొగ్గుకు గిరాకి తగ్గి నిలువలు పెరిగిపోతున్నాయని, మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిం చాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంస్థలే నేరుగా జీతాలు ఇవ్వాలని, ఈ నెలాఖరు వరకు ఇవ్వక పోతే నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు హెచ్చరించారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ జాతీయ ముఖ్య ఉపాధ్యక్షులు జనక్‌ప్రసాద్, ఇనుగాల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి ఆర్.డి.చంద్రశేఖర్, నాయకులు పి.మహేందర్‌రెడ్డి, హనుమంతరావు, త్యాగరాజు, లక్ష్మణ్, సదయ్య పాల్గొన్నారు.