ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షం | The vote on the removal of the opposition fire | Sakshi
Sakshi News home page

ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షం

Published Sun, Nov 1 2015 3:03 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షం - Sakshi

ఓట్ల తొలగింపుపై భగ్గుమన్న విపక్షం

♦ రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం
♦ ఆధారాలు, విజ్ఞాపనలను స్వీకరించిన కమిటీ
♦ సోమేశ్‌కుమార్, భన్వర్‌లాల్,సీఎం కేసీఆర్‌పై చర్యలకు పార్టీల డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతో, టీఆర్‌ఎస్ అధికార దాహంతోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 30 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించారంటూ ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్ బృందానికి తెలిపాయి. గ్రేటర్‌లో ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు మేరకు విచారణ జరిపేందుకు హైదరాబాద్ వచ్చిన 14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల సంఘం బృందం శనివారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో అన్ని రాజకీయపార్టీలతో సమావేశమైంది. ఆయా పార్టీల ప్రతినిధులతో సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఆధారాలను, విజ్ఞాపనలను కమిటీ స్వీకరించింది. అన్ని పార్టీల ప్రతినిధులతో ఒకేసారి కాకుండా, అక్షర క్రమంలో ఒక్కొక్క పార్టీకి చెందిన ప్రతినిధులనే పిలిచి ప్రత్యేకంగా విచారించారు. విచారణ సమయంలో రాష్ట్రానికి చెందిన అధికారులెవరినీ లోపలకు అనుమతించలేదు. కాగా, కమిటీని కలసిన వారిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్, బీజేపీ మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రాం నర్సింహరావు, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి.నర్సింగరావు, ఎంఐఎం ఎమ్మెల్సీ జాఫ్రీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానంద, అరికెపూడి గాంధీ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ తదితరులున్నారు. విపక్షాలను దెబ్బతీసేందుకు చేసిన ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి సోమేశ్‌కుమార్, రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ పాత్రధారులు కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సూత్రధారి అని ప్రతిపక్ష పార్టీల సభ్యులు కమిటీకి నివేదించారు.
 బృందాలుగా విడిపోయి విచారణ
 గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు భారీగా ఓట్లు తొలగించారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుల్లో ఎంతవరకు వాస్తవముందో తేల్చేందుకు ఉన్నతాధికారులతో కూడిన బృందాలు శనివారం సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజవర్గాల్లో విచారణ చేపట్టాయి. పశ్చిమబంగా ముఖ్య ఎన్నికల అధికారి సునీల్‌గుప్తా ఆధ్వర్యంలో నగరానికి వచ్చిన అధికారులు మరికొంత మంది ఎన్నికల అధికారులతో కలసి ఓటరు జాబితాలను పరిశీలించారు. ఓట్లను తొలగించినట్టు ప్రధాన ఆరోపణలు వచ్చిన సనత్‌నగర్ నియోజకవర్గంలో మూడు టీంలుగా ఎన్నికల సంఘం అధికారులు విచారణ చేపట్టారు. షిఫ్టింగ్‌లు, డోర్‌లాక్‌ల పేరుతో ఓటర్లను తొలగించారని వారికి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సనత్‌నగర్ ఎస్‌ఆర్‌టీ, కైలాస్ నగర్, బాపూనగర్, అమీర్‌పేట్‌కు చెందిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి జాబితాను, ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఒక్కో టీంకు ఒక్కో డాకెట్ కింద 12 నుంచి 20 మంది ఓటర్ల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలను సేకరించారు. ఆరోపణలు వచ్చిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ డివిజన్ శ్రీకృ ష్ణానగర్‌లో ఫిర్యాదులను పరిశీలించి ఓట్ల తొలగింపు వ్యవహారంపై తనిఖీలు నిర్వహించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు విచారణ జరిపారు.
 
 రంగారెడ్డి కలెక్టరేట్‌లో భేటీ
 సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రేటర్‌లో లక్షల ఓట్ల తొలగింపు ఘటనపై విచారణకు కేంద్రం నుంచి వచ్చిన బృందం శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డితోపాటు కలెక్టర్ రఘునందన్‌రావు, మెదక్ కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న 24 నియోజకవర్గాలకు చెందిన ఓటర్ల జాబితాను సమీక్షించారు. లక్షల సంఖ్యలో ఓట్లు తొలగింపుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రక్రియ రెండు మూడు రోజులు కొనసాగనుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement