విజేత ఆత్మకూరు జట్టు
- బ్యాట్స్‌మన్ రూపేష్ ఆల్ రౌండ్ ప్రతిభ
అనంతపురం సప్తగిరి సర్కిల్ :
సెంట్రల్ జోన్ క్రికెట్ బాలుర పోటీల్లో ఆత్మకూరు జట్టు విజేతగా నిలిచింది. బ్యాట్స్‌మన్ రూపేష్ ఆల్‌రౌండ్ ప్రతిభతో జట్టుకు విజయాన్నందించాడు. బుధవారం నగరంలోని ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానం, కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో మ్యాచ్‌లు జరిగాయి. క్వార్టర్ ఫైనల్‌లో ఆత్మకూరు, పెనుకొండ జట్లు తలపడగా ఆత్మకూరు జట్టు విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో ముదిగుబ్బ, తాడిపత్రి జట్లు తలపడగా ముదిగుబ్బ జట్టు గెలుపొందింది.
సెమీఫైనల్‌లో విన్సెంట్ డీ పాల్ అనంతపురం, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడగా 24 పరుగులతో ముదిగుబ్బ జట్టు విజయం సా«ధించింది. మరో సెమీఫైనల్‌లో కదిరి వాల్మీకి జట్టుపై ఆత్మకూరు జట్టు 12 పరుగుల తేడాతో విజయదుందుభి మోగించింది. ఫైనల్‌లో ఆత్మకూరు జట్టు, పీవీఎస్ ముదిగుబ్బ జట్లు తలపడ్డాయి. ఆత్మకూరు జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 109 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పీవీఎస్ ముదిగుబ్బ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆత్మకూరు జట్టు 29 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. జట్టులో రూపేష్ 21 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 58 పరుగులు సాధించాడు. ఆత్మకూరు జట్టు విజయానికి రూపేష్ చేసిన పరుగుల వరదే కీలకం. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పెనుకొండపై 28, కదిరి జట్టుపై 41 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.
గురువారం ఆర్ట్స్ కళాశాల, కొత్తూరు ఉన్నత పాఠశాల క్రీడా మైదానాల్లో బాల. బాలికల ఫుట్‌బాల్ పోటీలు జరుగుతాయని సెంట్రల్ జోన్ కార్యదర్శి శంకరన్న, పీఈటీ వేణుకుమార్‌లు తెలిపారు. కార్యక్రమంలో పీఈటీలు బాషా, రాగేష్, సిద్ధన్న తదితరులు పాల్గొన్నారు.