కర్నూలు, చిత్తూరు జట్ల విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న అండర్–19 అంతర్ జిల్లా బాలికల క్రికెట్ టోర్నీలో రెండో రోజు కర్నూలు, చిత్తూరు జట్లు విజయం సాధించాయి. ఆదివారం స్థానిక అనంత క్రీడా గ్రామంలో జరిగిన ఈ మ్యాచ్‌లలో ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అనంత జట్టు ఓటమిని చవిచూసింది. విన్సెంట్ గ్రౌండ్‌లో అనంతపురం, కర్నూలు జిల్లా జట్లు తలపడ్డాయి.
‘అనంత’ ఓటమి
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 172 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. జట్టులో పల్లవి 97 పరుగులు సాధించింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. జట్టులో ఎం అనూష 76 బంతుల్లో 22 ఫోర్ల సహాయంతో 109 పరుగులు సాధించింది.
చిత్తూరు గెలుపు
బీ గ్రౌండ్‌లో నెల్లూరు, చిత్తూరు జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నెల్లూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 228 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. జట్టులో సింధూజ 89 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 48 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నందుకుంది. జట్టులో పద్మజ 74 పరుగులు చేసింది.
నేడు అండర్–19 టోర్నీకి విరామం
అండర్–19 బాలికల టోర్నీకి సోమవారం విరామం ప్రకటించినట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. మంగళవారం మ్యాచ్‌లు కొనసాగుతాయన్నారు.