ఇక విజృంభించి పనిచేస్తాం | The work for singling | Sakshi
Sakshi News home page

ఇక విజృంభించి పనిచేస్తాం

Published Wed, Nov 25 2015 1:38 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

ఇక విజృంభించి పనిచేస్తాం - Sakshi

ఇక విజృంభించి పనిచేస్తాం

సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా ప్రజలు చరిత్రలో కనీవినీ ఎరుగని అపురూపమైన తీర్పు ఇచ్చారని.. తెలంగాణలోని 17 స్థానాల్లో ఎప్పుడూ ఎవరికీ రాని మెజారిటీఇచ్చి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, టీఆర్‌ఎస్ పక్షాన, వ్యక్తిగతంగా రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నానని, ఈ విజయంతో ప్రభుత్వం బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉందని నిరూపించిన ఎన్నిక ఇదని వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్‌లో పలువురు మంత్రులతో కలసి సీఎం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.

వరంగల్ ప్రజలు ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో, ఇప్పుడు సంపూర్ణ మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు చూపుతున్న అసహన వైఖరి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ‘‘రైతుల రుణమాఫీ విషయంలో అనని దాన్ని సృష్టిం చారు. పిచ్చి పత్రిక రాయగానే రెచ్చిపోయి, సీఎంగా బాధ్యత స్వీకరించిన ఐదో రోజే దిష్టిబొమ్మలు దహనం చేసిన సంస్కారం ప్రతిపక్షాలది. తొందరపాటుతో, ఓర్వలేనితనంతో, అడ్డూ అదుపూ లేకుండా వ్యక్తిగత ఆరోపణలు చేశారు. నీచాతి నీచమైన మాటలు మాట్లాడారు. ప్రజలు వారిని అసహ్యించుకునే ఈ తీర్పు ఇచ్చారు. బతిమిలాడితే, డబ్బులు ఇచ్చి కొంటే వచ్చిన ఓట్లు కావు. జనం ఇష్టపూర్వకంగా, తండోపతండాలు వచ్చి ఓట్లు వేశారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

 ప్రతీ నిర్ణయంపై విమర్శలు: ‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని, టీఆర్‌ఎస్ నాయకులను, మంత్రులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఒక పత్రిక చెప్పిందే తడవుగా ప్రతిపక్షాలు ప్రేలాపనలు పేలేవి. రవీంద్ర భారతి స్థానంలో కళాభారతి కడతామంటే ధర్నాలు. ముసుగు వీరులను పంపి పిల్ దాఖలు చేయించడం. టీఆర్‌ఎస్‌కు మంచి పేరు రావద్దన్న ప్రయత్నం. సెక్రటేరియట్ మార్చి కొత్తది కడతామంటే వ్యతిరేకత. చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా ఆసుపత్రి తరలిస్తామంటే వివాదం చేశారు..’’ అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మిషన్ కాకతీయను ఎందరెందరో పొగిడినా... ఇక్కడి విపక్షాలు మాత్రం కమీషన్ కాకతీయ అని విమర్శించాయని పేర్కొన్నారు.

హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేసి, కంపును కడుగుతామంటే వివాదం చేశారన్నారు. వాటర్ గ్రిడ్‌కు రూ.30వేల కోట్లు ఎందుకు రూ. 10 వేల కోట్లు చాలన్నారని... అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువగా ఊహించుకుందని, గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడారని చెప్పారు. రైతుల రుణమాఫీ పథకం ఏపీలో గోల్‌మాల్ జరిగినట్లు తెలంగాణలో జరగలేదని.. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ, కరెంటు సమస్యను నివారించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెన్షన్లు ఇతరత్రా కలిపి రూ. 33 వేల కోట్లు సంక్షేమానికి బడ్జెట్ ఇచ్చామని తెలిపారు.

అసత్య ప్రచారాలు మానుకుని, నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలకు హితవు పలికారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరంగల్‌లో 22 శాతం ఓట్లు వస్తే, ఈసారి 15 శాతమే వచ్చి, డిపాజిట్ కూడా పోయిందన్నారు. ప్రభుత్వంపై కృత్రిమ వ్యతిరేకతను వాళ్ల బుర్రల్లో సృష్టించుకుని ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూశారని విమర్శించారు. అయినా ప్రజలు తమ వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ఇక విజృంభించి పనిచేస్తామని చెప్పారు.

 2021 నాటికి కోటి ఎకరాలకు నీరు..
 ‘‘రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లానింగ్‌తో సంవత్సరం నుంచి బిజీగా ఉన్నాను. పార్టీ నాయకులకు, శ్రేణులకూ దూరం అయ్యా. ఇపుడు 90శాతం ప్లానింగ్ పూర్తయింది. లైడార్ సర్వే పూర్తయ్యింది. కాళేశ్వరంలో 365 రోజులు 16 టీఎంసీల నీటి లభ్యత ఉంది. రాజీవ్-ఇందిరా సాగర్ ద్వారా ఖమ్మం జిల్లాలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. కాళేశ్వరం, లోయర్ పెన్‌గంగా, రాజీవ్- ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు త్వరలో శంకుస్థాపన చేస్తా. దగ్గరుండి ప్రాజెక్టులు పూర్తి చేయిస్తాం. 2021 వరకు తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం’’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
 
 తల పోయినా తప్పు చేయం..
 తెలంగాణలో నీటి పారుదల రంగం విషయంలో దగా పడిందని... నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతోనే ఉద్యమం జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘పొరుగు రాష్ట్రాలతో గొడవలు ఉంటాయి. ఒక్క ఏపీ అనే కాదు మహారాష్ట్రతో కూడా గొడవలు ఉంటాయి. అన్నీ చూసుకోవాలి. తలకాయ పోయినా తప్పు చేయం. తెలంగాణకు శాశ్వతంగా కరువు పరిస్థితులు దూరం కావాలనే... ప్రాజెక్టుల రీడిజైన్ చేపట్టాం. ఆంధ్రా పాలకులు గతంలో మొదలు పెట్టినవి నీళ్లిచ్చే పథకాలు కాదు. దీనికి ఎస్‌ఎల్‌బీసీ మంచి ఉదాహరణ. ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదం ఉంటే జటిలం చేయడం, లేదంటే సృష్టించడమే వారి విధానం..’’ అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement