
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి.. యువకుడు దుర్మరణం
⇒చిలంకూరులో విషాధం
⇒ఈ నెల 16న పెళ్లి
ఎర్రగుంట్ల : తన వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రికలను బంధువులు, స్నేహితులకు పంచేందుకు వెళుతూ ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మరో నాలుగు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమా దం సంభవించి మృత్యువాతపడడంతో చిలంకూరులో విషాధం అలుముకుంది. మండలంలోని చిలంకూరుకు చెందిన వీరనారాయణకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరు ప్రేమ్ నజీర్. ఇతను డిప్లమో వరకు చదువుకున్నారు. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నజీర్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో వివాహ సంబంధం కుదిరింది. ఈనెల 16,17తేదీలలో వివాహం చేయాలని ఇరుకుటుంబాల వారు నిశ్చయించారు.
అందరూ బంధువులు, స్నేహితులు, కావాల్సిన వారిని పిలిచే కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. నజీర్ కూడా సోమవారం అనంతపురం జిల్లా కదిరికి వెళ్లి అక్కడ స్నేహితులకు పెళ్లి పత్రికలు ఇచ్చారు. తర్వాత బెంగళూరుకు పోవడానికి కదిరిలో బస్సు ఎక్కి వెనుక సీటులో కూర్చున్నారు. ముత్యాల చెరువు వద్దకు వెళ్లే సరికి లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో నజీర్ దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలియగానే చిలంకూరులో విషాధం చోటు చేసుకుంది. కుటుంబీకులు బోరును విలపించారు. నాలుగు రోజుల్లో వివాహం జరగాల్సిన ఉండగా మృత్యువాత పడడంతో బంధువులు, గ్రామస్తులు తీవ్ర విషాధంలో మునిగిపోయారు. సోమవారం సాయంత్రం కదిరి నుంచి మృతదేహం రాగానే అంత్యక్రియలు నిర్వహించారు.