కానిస్టేబుళ్ల ఇళ్లల్లో చోరీ
►దైవ దర్శనానికి వెళ్తే ఇళ్లు గుల్ల
►రూ.47వేలు నగదు, 8 తులాల బంగారు
►ఆభరణాల అపహరణ
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): నగరంలోని కంఠేశ్వర్ బ్యాంక్‌కాలనీలో నివాసం ఉండే ఇద్దరు కానిస్టేబుళ్ల ఇళ్లల్లో చోరీ జరిగింది. ఇండ్లకు వేసి ఉన్న గొళ్లేలు, తాళాలు పగల గొట్టి బీరువాల్లో దాచిపెట్టిన నగదు, బంగారం సొత్తుతో ఉడయించారు. బాధితుల కథనం ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్ కమాన్ బ్యాంక్ కాలనీకి చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింగ్‌రావు, సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఇద్దరు అన్నదమ్ములు. వీరి ఇళ్లు పక్కపక్కనే ఉంటాయి. ఈనెల 13వ తేదీ రాత్రి అన్నదమ్ములు వారి ఇళ్లకు తాళాలు వేసి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకునేందుకు మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నాంపల్లి లక్ష్మీనరసింహ స్వామి దైవ దర్శనానికి వెళ్లారు. అయితే ఈ రెండు ఇండ్లకు తాళాలు వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు గొళ్లేలను తొలగించి చోరీ చేశారు.
నర్సింగ్‌రావు ఇంట్లో బీరువాలోని దాచి ఉంచిన రూ.42 వేలు నగదు, ఆ రు తులాల బంగారు అభరణాలు బ్రా స్‌లెట్, చైన్లు, ఉంగరాలు ఎత్తుకుపోయారు. దొంగల్లో ఒకరి చేతికి ఉన్న వా చ్‌ను తీసి అక్కడే బెడ్‌పై పెట్టి మరిచిపో యి వెళ్లారు. ఈ వాచ్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. అలాగే నర్సింగ్‌రావు తమ్ముడు ప్రమోద్ ఇంటి గొళ్లేనికి వేసిన తాళం అలాగే ఉంచి గొళ్లెం కొక్కెను తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో దాచిపెట్టిన రూ.5 వేల నగదుతోపాటు రెండున్నర తులాల బంగారు ఉంగరాలు (చిన్న పిల్లలవి), మూడు జతల కమ్మలు, వెండి వస్తువులను ఎత్తుకుపోయారు.
దైవ దర్శనం చేసుకుని ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఇంటికి చేరుకున్న కానిస్టేబుళ్లకు ఇంట్లో లైట్లు వెలుగుతుండటం చూసి ఆశ్చర్యపోయారు. గేట్ తాళం తీసి ప్రధాన ద్వారం గొళ్లెం చూడగా పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి చూశారు. బీరువాలోని వస్తువులన్ని చిందరవందరగా పారవేసి ఉండటం, దాచిన సొత్తు కనిపించకపోవటంతో చోరి జరిగినట్లు గుర్తించి సోమవారం ఉదయం మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై శ్రీహరి సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌టీంను రప్పించారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.