స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌లను పరిశీలిస్తున్న డీసీపీ కమల్‌హాసన్‌రెడ్డి
గన్‌ఫౌండ్రీ: నగరంలోని పలు చౌరస్తాలలో ప్రయాణికులతో గొడవకు దిగి వారి వద్ద నుంచి ఖరీదైన మొబైల్‌ఫోన్‌లను దొంగిలిస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.25లక్షల విలువ గల 65 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సైఫాబాద్‌లోని సెంట్రల్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ కమల్‌హాసన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఖురేషి(23), షారుఖ్ బెద్రి పతన్(21), ఫరజ్ పతన్(21), మహ్మద్ నయీం(55), మహ్మద్ అనాస్ ఖురేషి(19) రెండు గ్రూప్‌లుగా ఏర్పడి కారులో ఒంటరిగా డ్రెవింగ్ సీటు పక్కన ఫోన్ పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
వాహనదారులను కొంత దూరం వెంబడించి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కారు ఆపగానే ముందు టైర్ తమ కాళ్లపైకి వచ్చిందటూ ఒకరు గొడవ పడుతుండగా మరోవైపు నుంచి మరో ఇద్దరు వచ్చి ఫోన్‌లు ఎత్తుకెళ్లేవారన్నారు. ఇటీవల పలు పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఈ తరహా ఫిర్యాదులు రావడంతో దీనిపై దృష్టి సారించమన్నారు. సైఫాబాద్ పోలీసులు మాసబ్‌ట్యాంక్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా అక్కడ ఒక వాహనదారుడితో గొడవ పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు.
వీరు ట్రూప్ బ్యాండ్ సభ్యులుగా చెప్పుకుని అఫ్జల్‌గంజ్‌లోని ఒక లాడ్జిలో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. ఈ ముఠా హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు, ముంబాయి నగరాల్లోనూ ఈ తరహా దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. ప్రధాన సూత్రధారి బురతో పాటు ఇతర నిందితులు షాకీర్, సాజిద్ పరారీలో ఉండగా, అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఏసీపీ సురేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్, నరహరి, డీఎస్సైలు శ్రీకృష్ణ, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.