అక్కడ కిలో బీర రూ. 3లే!
బహిరంగ మార్కెట్‌లో కిలో బీరకాయలు అమ్మకం ధర రూ. 30లు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ రైతునుంచి దళారులు కొనుగోలు చేస్తున్నది ఎంతకో తెలుసా... అక్షరాలా రూ. 3లుకే. ఇది నమ్మలేకపోతున్నారు కదూ... అయితే గజపతినగరం మండలం బంగారంపేట వెళ్లాల్సిందే. ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు పండిస్తున్న బీరకాయల్ని దళారులు కేవలం మూడురూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్‌కు సరఫరా చేసి మనకు రూ. 30లు వంతున విక్రయిస్తున్నారు. ఎంత అన్యాయం?
* పండించే రైతన్నకు మిగిలేది కష్టమే
* దళారులకు దండిగా లాభాలు
* అన్యాయం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువు
గజపతినగరం రూరల్: మండలంలో ఉభాలు ప్రారంభానికి ముందు వివిధ గ్రామాల రైతులు విరివిగా కూరగాయలు పండించడం ఆనవాయితీ. పదేళ్లుగా బంగారమ్మ పేట, భూదేవి పేట, పాతబగ్గాం, మెంటాడ మండలం ఇద్దనవలస, కంటుభుక్తవలస, శాలి పేట, జక్కువ తదితర గ్రామాల్లో రైతులు బీరకాయలు పండిస్తున్నారు.
వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉభాలకోసం వినియోగిస్తారు. అయితే వీరికి సరైఏన మద్దతు ధర కల్పించకపోవడంతో వీరి కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీరకాయలు కిలో రూ. 30లు పలుకుతుండగా... దళారులు రైతులకు చెల్లించేది కేవలం కిలోకు మూడురూపాయలే.
ఒకవైపు పంటపోయి...
ఇటీవల కురుస్తున్న చిరుజల్లులకు పంట కాస్తా తీవ్రంగా నష్టపోయామనీ... దీనికి తోడు దళారులు తమనుంచి తక్కువధరకే కొనుగోలు చేస్తుండటంతో అసలు గిట్టుబాటు కావడంలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏటా రూ. 6ల నుంచి రూ. 8లకు కొనుగోలు చేసేవారనీ, ఈ ఏడాది మరీ తక్కువ ఇస్తుండటంతో పెట్టుబడులు సైతం రావట్లేదని వారు బోరుమంటున్నారు. బంగారమ్మపేట గ్రామం నుంచి రెండు రోజుల కొకసారి రెండు మూడు లారీల బీరకాయల్ని దళారులు కొనుగోలు చేసి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, తదితర ప్రాంతాలకు తరలించి కాసులు కూడబెట్టుకొని రైతుల శ్రమను దోచేస్తున్నారు.
ఇంటింటా అమ్మకాలు
మొదట్లో కేజి బీరకాయలు 8రూపాయలకు కొనేవారు. ఇప్పుడు మూడు రూపాయలే ఇస్తామంటున్నారు. వారంతా సిండికేట్‌గా మారడంతో ఏం చేయాలో తెలీడం లేదు. ఇక చేసేది లేక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజపతినగరం వీధుల్లో సైకిల్‌పై తిప్పుతూ కేజీ బీరకాయలు 20రూపాయలకు అమ్ముకుంటున్నాను.
- జొన్నాడ రాము, కూరగాయల రైతు, బంగారమ్మపేట
పెట్టుబడులైనా రాలేదు
గడచిన ఐదేళ్లుగా బీరకాయలు సాగు చేస్తున్నాను. పండించిన మొదటి రెండు మూడు సంవత్సరాలూ పంట దిగుబడితోపాటు మద్దతు ధర కూడా బాగుండేది. ఇప్పుడు కేజీ బీరకాయలు మూడు నుంచి నాలుగు రూపాయలకే అమ్మాల్సి వస్తోంది.
- సుంకరి సన్యాసి, కూరగాయల రైతు, బంగారమ్మపేట