హస్తి స్తుతి | Luffa curry is very good for health | Sakshi
Sakshi News home page

హస్తి స్తుతి

Published Sat, Nov 16 2019 2:49 AM | Last Updated on Sat, Nov 16 2019 2:49 AM

Luffa curry is very good for health - Sakshi

నేతి బీరను ఆయుర్వేదంలో హస్తి పర్ణ అంటారు. మెత్తగా జిగురు కలిగి ఉంటుంది కాబట్టి ఇది నేతి బీర అయ్యింది. ‘నేతి బీరలో నెయ్యి చందం’ అని సామెత. నేతి బీరలో నెయ్యి లేకపోవచ్చు కాని చాలా ఆరోగ్య హేతువులున్నాయి. ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కనుక నేతి బీర తినండి. చేసే మేలును స్తుతించండి.

నేతి బీరకాయ గుత్తి కూర
కావలసినవి: నేతి బీరకాయలు – అర కేజీ; ఉల్లి పేస్ట్‌ – పావు కప్పు; టొమాటో పేస్ట్‌ – పావు కప్పు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టేబుల్‌ స్పూను; నూనె – తగినంత.

తయారీ:
►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి తొక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా, మధ్యలో గుత్తిగా వచ్చేలా తర గాలి
►ఒక పాత్రలో ఉల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పల్లీ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము, మిరప కారం, ఉప్పు వేసి ముద్దలా కలపాలి
►స్టౌ మీద పాన్‌లో నూనె  వేసి కాచాలి
►ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేయించాక, పసుపు జత చేసి దింపేయాలి
►గుత్తులుగా తరిగిన బీరకాయలోకి మసాలా మిశ్రమం స్టఫ్‌ చేసి, కాగుతున్న నూనెలో వేయాలి
►బాగా ఉడికిన తరవాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి
►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

నేతి బీరకాయ కొత్తిమీర పచ్చడి
కావలసినవి: నేతి బీరకాయ – 1; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత.

పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఎండు మిర్చి – 8; కరివేపాకు – రెండురెమ్మలు.

తయారీ:
►నేతి బీరకాయను శుభ్రంగా కడిగి, పల్చగా తొక్క తీసేయాలి (లేతగా ఉంటే తొక్క తీయక్కర్లేదు)
►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి తరుగు, నేతి బీరకాయ ముక్కలు, వెల్లులి రేకలు వేసి సుమారు ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి
►కొత్తిమీర, చింతపండు గుజ్జు జత చేసి, మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి
►జీలకర్ర జత చేసి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేయించి దింపి, సిద్ధంగా ఉన్న పచ్చడికి జత చేయాలి
►వేడివేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది.

నేతి బీరకాయ బజ్జీ
బజ్జీకావలసినవి: నేతి బీర కాయ – 1; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా; చాట్‌ మసాలా – 3 టీ స్పూన్లు

పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 4 టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; తినే సోడా – పావు టీ స్పూను.

తయారీ:
►బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి
►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, మిరప కారం, తినే సోడా, నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి
►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తరిగి ఉంచుకున్న నేతి బీరకాయ చక్రాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్‌ టవల్‌ మీదకు తీసుకోవాలి
►చాట్‌ మసాలా చల్లి వేడివేడిగా అందించాలి.

నేతి బీరకాయ వడల కూర
కావలసినవి: నేతిబీర కాయలు – అర కేజీ; మసాలా వడలు – 5; నూనె – అర కప్పు; తాలింపు గింజలు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 6; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను.

తయారీ:
►నేతిబీరకాయలను శుభ్రంగా కడిగి, తొక్కు తీసి, ముక్కలుగా కట్‌ చేయాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి బాగా వేయించాలి
►వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి
►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి
►నేతి బీరకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, మెత్తబడేవరకు ఉడికించాలి
►కొన్ని వడలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఉడుతుకుతున్న కూరకు జత చేయాలి
►మరి కొన్ని వడలను మెత్తగా చేసి ఆ పొడిని కూర కు జత చేయాలి
మిరప కారం వేసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి దింపేయాలి
►అన్నంలోకి రుచిగా ఉంటుంది.

నేతి బీరకాయ టొమాటో కర్రీ
కావలసినవి: నేతి బీర కాయ ముక్కలు – రెండు కప్పులు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత.

తయారీ:
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►టొమాటో తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి
►నేతి బీర కాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి
►ఉప్పు వేసి మరోమారు కలిపి, తడి అంతా ఇంకిపోయే వరకు ఉడికించి దింపేయాలి
►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది.

నేతి బీరకాయ నువ్వుల మసాలా కూర
కావలసినవి: నేతి బీర కాయలు – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత;

నువ్వుల మసాలా కోసం: వేయించిన నువ్వులు – 2 టేబుల్‌ స్పూన్లు; బియ్యం – ఒక టేబుల్‌ స్పూను; ఎండు మిర్చి – 2; పాలు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ:
►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి
►మిక్సీలో నువ్వులు, బియ్యం, ఎండు మిర్చి వేసి, పాలు జత చేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి
►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి
►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి
►నేతి బీర కాయ ముక్కలు వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు జత చేసి మూత పెట్టి ఉడికించాలి
►బాగా మెత్త పడిన తరవాత నువ్వుల మసాలా మిశ్రమం వేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement