Luffa
-
బీరకాయతో నాన్‌వెజ్ ట్రై చేశారా.. ఇలా చేస్తే అదిరిపోవాల్సిందే!
కూరగాయలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. బీరకాయలో పీచుపదార్థం, విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, జింక్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీర తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా రక్తహీనత, చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు. రుచిలో కాస్త చప్పగా ఉండే బీరకాయను వివిధ రకాల కాంబినేషన్లలో వండితే మరిన్ని పోషకాలతో పాటు రుచి కూడా పెరుగుతుంది. ఎండురొయ్యలు బీర కుర్మా కావలసినవి: ఎండు రొయ్యలు – పావు కేజి; బీరకాయ – ఒకటి; ఆయిల్ – మూడు టీస్పూన్లు; ఉల్లిపాయ – ఒకటి(సన్నగా తరుక్కోవాలి); ఉప్పు – రుచికి సరిపడా; అల్లం వెల్లుల్లి పేస్టు – అరటీస్పూను; కరివేపాకు – ఒక రెమ్మ; చింతపండు – పావు టీస్పూను; ధనియాల పొడి – పావు టీస్పూను; జీలకర్ర పొడి – పావు టీస్పూను; కారం – రెండు టీస్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను. తయారీ..ముందుగా ఎండు రొయ్యల తల, తోక తీసి ఇసుకలేకుండా శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి. ►బీరకాయ తొక్కతీసి సన్నని ముక్కలు చేయాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పువేసి వేగనివ్వాలి. ►మరో పాన్‌లో కప్పు నీళ్లు పోసి ఎండు రొయ్యలు వేసి నాలుగు నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఉల్లిపాయ ముక్కలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, కరివేపాకు, పసుపు వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు బీరకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలపాటు మూత పెట్టి ఉడకనిచ్చి, ఉడికించి పెట్టుకున్న ►ఎండు రొయ్యలు వేసి మరో ఎనిమిది నిమిషాలు మగ్గనివ్వాలి ►తరువాత గరం మసాలా వేసి తిప్పి నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే ఎండురొయ్యలు బీరకాయ కుర్మా రెడీ. బీరకాయ చికెన్ కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – అరకేజి; ఆయిల్ – నాలుగు టీ స్పూన్లు; పచ్చిమిరపకాయలు – మూడు (నిలువుగా కట్ చేయాలి); ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా కట్ చేయాలి); అల్లం వెల్లుల్లి పేస్టు – ఒకటిన్నర టీ స్పూను; పసుపు – అర టీస్పూను; బీరకాయ ముక్కలు – ఒక కప్పు; కారం – రెండు టీ స్పూన్లు; ధనియాల పొడి – టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; తరిగిన కొత్తిమీర – పావు కప్పు; ఉప్పు – రుచికి సరిపడా. తయారీ.. చికెన్‌ను శుభ్రంగా కడిగిపెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ►ఉల్లిపాయలు వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి. ►అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక చికెన్ ముక్కలు వేసి మూతపెట్టి పదినిమిషాలు ఉడికించాలి. ►తరువాత బీరకాయ ముక్కలు వేసి మూతపెట్టి ఐదు నిమిషాలయ్యాక, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ►తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలాక, కొత్తిమీర వేసి స్టవ్ ఆపేస్తే బీరకాయ చికెన్ రెడీ. బీర ఖీబా కావలసినవి: మటన్ ఖీమా – పావు కేజి; బీరకాయ ముక్కలు – అరకేజి(తొక్కతీసినవి); తరిగిన పచ్చిమిర్చి – రెండు; వెల్లుల్లి తురుము – టీస్పూను; ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు; మిరియాల పొడి – టీ స్పూను; పసుపు – టీస్పూను; కారం – రెండు టీ స్పూన్లు; గరం మసాలా – అరటీస్పూను; జీలకర్ర – టీస్పూను; ఆవ నూనె – నాలుగు టీ స్పూన్లు; ఉప్పు– రుచికి సరిపడా. తయారీ.. మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కాక జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత పచ్చిమిర్చి తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ►ఇవన్నీ వేగాక పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►బీరకాయ ముక్కలు సగం ఉడికిన తరువాత కొద్దిగా ఉప్పు, మటన్ ఖీమా వేసి మూతపెట్టి పదిహేను నిమిషాలు ఉడికించాలి. ►ఖీమాలో వచ్చిన నీళ్లన్నీ ఇగిరిపోయాక, కారం, మిగిలిన మసాలా పొడులు వేసి వేగనివ్వాలి. ►చివరిగా ఉప్పు చూసి సరిపోకపోతే కొద్దిగా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనిస్తే బీర ఖీమా రెడీ. -
అనారోగ్యాలను దూరం చేసే నేతి బీరకాయ
ఏ రకమైన ఔషధ విలువలు లేని ద్రవ్యం (పదార్థం) ఈ జగత్తులో లేదని ఆయుర్వేదశాస్త్రం చెబుతుంది. అదే విషయాన్ని పరిశోధనాత్మకంగా నిర్ధారించింది. అందుకు ఉదాహరణ నేతి బీరకాయ. శాకాహారంలో మనం నిత్యం తినే బీరకాయ అందరికీ తెలిసిందే. దీనినే రాజకోశాతకీ ( (luffa accutangula, లప్ఫా ఎక్యూటాంగిలా) అని భావమిశ్రుడు అభివర్ణించాడు. అంతేకాకుండా మహాకోశాతకీ అని ఇంకొక రకం కూడా చెప్పాడు. ఇదే నేతి బీర (లప్ఫాసిలిండ్రికా/ఎజిప్టియాకా). దీనినే చరకుడు ఘృతకోశాతకీ అని వివరించాడు. ‘హస్తి ఘోషా, హస్తి పర్ణ, హస్తి కోశాతకీ, మహాఫలా అని నేతిబీరకు పర్యాయపదాలు ఉన్నాయి. గుణాలు: ‘మహాకోశాతకీ స్నిగ్థా రక్తపిత్తానిలాపహా’ ఇది మెత్తగా, జిగురు కలిగి మృదువుగా ఉంటుంది (స్నిగ్ధ). అంటే నెయ్యి వలె చిక్కగా ఉంటుంది. అందుకే దీనికి నేతిబీర అని పేరు వచ్చింది. ఇది రక్తదోషాలను, పిత్తవికారాలనూ, వాత వ్యాధులనూ పోగొడుతుంది. అంటే అనేక చర్మరోగాలలోనూ, అధిక రక్త పీడనం (హై బీపీ), హృద్రోగాలలోనూ, నరాలకు సంబంధించిన వ్యాధులలోనూ గుణకారి. ఔషధ రూపాలు: పచ్చి దాని నుండి తీసిన రసం (స్వరసం), గుజ్జు (కల్కం), చూర్ణం (ఎండబెట్టి చేసిన పొడి). కాయ మాత్రమే కాకుండా, పండు (లేతదైనా, బాగా పక్వమైనదైనా) కూడా ఉపయుక్తమే. కషాయం చేసి కూడా వాడుకోవచ్చు. దీనికి గల ఇతర విలువలలో విషహరం, కృమిహరం ముఖ్యమైనవి. కొవ్వును కరిగించి శరీరపు బరువుని తగ్గిస్తుంది. పైల్స్ (మూలశంక) సమస్యను తొలగిస్తుంది. మధుమేహ నియంత్రణకు దోహదకారి. ఆధునిక శాస్త్ర విశ్లేషణ... నూరు గ్రాములకి 660 మి.గ్రా. మాంసకృత్తులు, 13. 38 కేలరీలు ఉంటాయి. శాకాహారంగా వాడుకోవచ్చు. పచ్చిగా కాని, వండుకొని కాని, పానీయంగా గాని సేవించవచ్చు. మరీ లేత కాయగా ఉన్నప్పుడు తొక్క తీయనవసరం లేదు. ముదిరితే మాత్రం తొక్క చేదుగా ఉంటుంది. అప్పుడే పండుగా మార్పు చెందిన దానిని తింటే జలుబు, ముక్కుదిబ్బడ, సైనస్ సమస్యలు తొలగిపోతాయి. తాజాఫలంలో లెవొనాయిడ్స్, ఓలియాలోనిక్ యాసిడ్, ఎస్కార్బిక్ యాసిడ్, కెరోటినాయిడ్సు, క్లోరోఫిల్స్ మొదలైనవి ఉంటాయి. వ్యాధినిరోధకశక్తిని అభివృద్ధి చేస్తుంది. ఎలర్జీలను, వాపులను, నొప్పుల్ని దూరం చేస్తుంది. ప్రసవ సమయంలో గర్భాశయ సంకోచానికి దోహదకారిౖయె సుఖ ప్రసవానికి సహకరిస్తుంది. కంతుల్ని, సూక్ష్మ క్రిముల్ని హరిస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
హస్తి స్తుతి
నేతి బీరను ఆయుర్వేదంలో హస్తి పర్ణ అంటారు. మెత్తగా జిగురు కలిగి ఉంటుంది కాబట్టి ఇది నేతి బీర అయ్యింది. ‘నేతి బీరలో నెయ్యి చందం’ అని సామెత. నేతి బీరలో నెయ్యి లేకపోవచ్చు కాని చాలా ఆరోగ్య హేతువులున్నాయి. ఇది రక్తాన్ని శుభ్ర పరుస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది. కనుక నేతి బీర తినండి. చేసే మేలును స్తుతించండి. నేతి బీరకాయ గుత్తి కూర కావలసినవి: నేతి బీరకాయలు – అర కేజీ; ఉల్లి పేస్ట్ – పావు కప్పు; టొమాటో పేస్ట్ – పావు కప్పు; వేయించిన పల్లీల పొడి – 2 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – పావు కప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి తొక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా, మధ్యలో గుత్తిగా వచ్చేలా తర గాలి ►ఒక పాత్రలో ఉల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, పల్లీ పొడి, నువ్వుల పొడి, కొబ్బరి తురుము, మిరప కారం, ఉప్పు వేసి ముద్దలా కలపాలి ►స్టౌ మీద పాన్‌లో నూనె వేసి కాచాలి ►ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, మినప్పప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి దోరగా వేయించాక, పసుపు జత చేసి దింపేయాలి ►గుత్తులుగా తరిగిన బీరకాయలోకి మసాలా మిశ్రమం స్టఫ్ చేసి, కాగుతున్న నూనెలో వేయాలి ►బాగా ఉడికిన తరవాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ కొత్తిమీర పచ్చడి కావలసినవి: నేతి బీరకాయ – 1; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 3; పచ్చి మిర్చి – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; పసుపు – చిటికెడు; ఎండు మిర్చి – 8; కరివేపాకు – రెండురెమ్మలు. తయారీ: ►నేతి బీరకాయను శుభ్రంగా కడిగి, పల్చగా తొక్క తీసేయాలి (లేతగా ఉంటే తొక్క తీయక్కర్లేదు) ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పచ్చి మిర్చి తరుగు, నేతి బీరకాయ ముక్కలు, వెల్లులి రేకలు వేసి సుమారు ఐదు నిమిషాలు పాటు ఉడికించాలి ►కొత్తిమీర, చింతపండు గుజ్జు జత చేసి, మిశ్రమం బాగా మెత్తగా అయ్యేవరకు కలుపుతూ ఉడికించాలి ►జీలకర్ర జత చేసి వేయించి దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మినప్పప్పు, సెనగ పప్పు, పసుపు, కరివేపాకు వేసి దోరగా వేయించి దింపి, సిద్ధంగా ఉన్న పచ్చడికి జత చేయాలి ►వేడివేడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ బజ్జీ బజ్జీకావలసినవి: నేతి బీర కాయ – 1; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; చాట్ మసాలా – 3 టీ స్పూన్లు పిండి కోసం: సెనగ పిండి – ఒక కప్పు; బియ్యప్పిండి – 4 టీ స్పూన్లు; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; తినే సోడా – పావు టీ స్పూను. తయారీ: ►బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాలుగా తరిగి పక్కన ఉంచాలి ►ఒక పాత్రలో సెనగ పిండి, బియ్యప్పిండి, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు, మిరప కారం, తినే సోడా, నీళ్లు పోసి బజ్జీల పిండి మాదిరిగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక, తరిగి ఉంచుకున్న నేతి బీరకాయ చక్రాలను నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►చాట్ మసాలా చల్లి వేడివేడిగా అందించాలి. నేతి బీరకాయ వడల కూర కావలసినవి: నేతిబీర కాయలు – అర కేజీ; మసాలా వడలు – 5; నూనె – అర కప్పు; తాలింపు గింజలు – రెండు టీ స్పూన్లు; వెల్లుల్లి రెబ్బలు – 6; కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 5; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను. తయారీ: ►నేతిబీరకాయలను శుభ్రంగా కడిగి, తొక్కు తీసి, ముక్కలుగా కట్ చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక తాలింపు గింజలు వేసి బాగా వేయించాలి ►వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు జత చేసి మరోమారు కలపాలి ►పచ్చి మిర్చి తరుగు, ఉల్లి తరుగు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టాలి ►నేతి బీరకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచి, మెత్తబడేవరకు ఉడికించాలి ►కొన్ని వడలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, ఉడుతుకుతున్న కూరకు జత చేయాలి ►మరి కొన్ని వడలను మెత్తగా చేసి ఆ పొడిని కూర కు జత చేయాలి మిరప కారం వేసి బాగా కలిపి మూత ఉంచి ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ టొమాటో కర్రీ కావలసినవి: నేతి బీర కాయ ముక్కలు – రెండు కప్పులు; టొమాటో తరుగు – ఒక కప్పు; ఉల్లి తరుగు – అర కప్పు; తరిగిన పచ్చిమిర్చి – 4; కరివేపాకు – రెండు రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – పావు టీ స్పూను; నూనె – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ►నేతి బీర కాయ ముక్కలు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ►ఉప్పు వేసి మరోమారు కలిపి, తడి అంతా ఇంకిపోయే వరకు ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి, రోటీలలోకి రుచిగా ఉంటుంది. నేతి బీరకాయ నువ్వుల మసాలా కూర కావలసినవి: నేతి బీర కాయలు – పావు కేజీ; ఉల్లి తరుగు – పావు కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 2 నూనె – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నువ్వుల మసాలా కోసం: వేయించిన నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; బియ్యం – ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2; పాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: ►నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, చెక్కు తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ►మిక్సీలో నువ్వులు, బియ్యం, ఎండు మిర్చి వేసి, పాలు జత చేసి మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►నేతి బీర కాయ ముక్కలు వేసి బాగా కలిపి, తగినంత ఉప్పు జత చేసి మూత పెట్టి ఉడికించాలి ►బాగా మెత్త పడిన తరవాత నువ్వుల మసాలా మిశ్రమం వేసి మరోమారు కలియబెట్టి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి. -
ఔరా.. బీర !
బీరకాయలు సాధారణంగా మూరెడు లేదంటే అంతకంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ గూడూరు మండలం పొనుగోడు గ్రామంలోని బెజ్జం రమేష్ ఇంట్లో బీర చెట్టుకు కాసిన కాయలు సుమారు అర మీటరుకు పైగా ఉండడం విశేషం. అలాగే, ఒక్కో కాయ కేజీన్నరకు పైగా బరువు తూగుతోంది. ఈ కాయ ఒక్కటి కూర వండుకుంటే కుటుంబం మెుత్తానికి సరిపోతుందంటూ గ్రామస్తులు పలువురు రమేష్ ఇంటి నుంచి తీసుకువెళ్తున్నారు. – గూడూరు -
అక్కడ కిలో బీర రూ. 3లే!
బహిరంగ మార్కెట్లో కిలో బీరకాయలు అమ్మకం ధర రూ. 30లు. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ రైతునుంచి దళారులు కొనుగోలు చేస్తున్నది ఎంతకో తెలుసా... అక్షరాలా రూ. 3లుకే. ఇది నమ్మలేకపోతున్నారు కదూ... అయితే గజపతినగరం మండలం బంగారంపేట వెళ్లాల్సిందే. ఆ మండలంలోని పలు గ్రామాల రైతులు పండిస్తున్న బీరకాయల్ని దళారులు కేవలం మూడురూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్‌కు సరఫరా చేసి మనకు రూ. 30లు వంతున విక్రయిస్తున్నారు. ఎంత అన్యాయం? * పండించే రైతన్నకు మిగిలేది కష్టమే * దళారులకు దండిగా లాభాలు * అన్యాయం జరుగుతున్నా పట్టించుకునేవారు కరువు గజపతినగరం రూరల్: మండలంలో ఉభాలు ప్రారంభానికి ముందు వివిధ గ్రామాల రైతులు విరివిగా కూరగాయలు పండించడం ఆనవాయితీ. పదేళ్లుగా బంగారమ్మ పేట, భూదేవి పేట, పాతబగ్గాం, మెంటాడ మండలం ఇద్దనవలస, కంటుభుక్తవలస, శాలి పేట, జక్కువ తదితర గ్రామాల్లో రైతులు బీరకాయలు పండిస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉభాలకోసం వినియోగిస్తారు. అయితే వీరికి సరైఏన మద్దతు ధర కల్పించకపోవడంతో వీరి కష్టాన్ని దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బీరకాయలు కిలో రూ. 30లు పలుకుతుండగా... దళారులు రైతులకు చెల్లించేది కేవలం కిలోకు మూడురూపాయలే. ఒకవైపు పంటపోయి... ఇటీవల కురుస్తున్న చిరుజల్లులకు పంట కాస్తా తీవ్రంగా నష్టపోయామనీ... దీనికి తోడు దళారులు తమనుంచి తక్కువధరకే కొనుగోలు చేస్తుండటంతో అసలు గిట్టుబాటు కావడంలేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏటా రూ. 6ల నుంచి రూ. 8లకు కొనుగోలు చేసేవారనీ, ఈ ఏడాది మరీ తక్కువ ఇస్తుండటంతో పెట్టుబడులు సైతం రావట్లేదని వారు బోరుమంటున్నారు. బంగారమ్మపేట గ్రామం నుంచి రెండు రోజుల కొకసారి రెండు మూడు లారీల బీరకాయల్ని దళారులు కొనుగోలు చేసి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, తదితర ప్రాంతాలకు తరలించి కాసులు కూడబెట్టుకొని రైతుల శ్రమను దోచేస్తున్నారు. ఇంటింటా అమ్మకాలు మొదట్లో కేజి బీరకాయలు 8రూపాయలకు కొనేవారు. ఇప్పుడు మూడు రూపాయలే ఇస్తామంటున్నారు. వారంతా సిండికేట్‌గా మారడంతో ఏం చేయాలో తెలీడం లేదు. ఇక చేసేది లేక 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజపతినగరం వీధుల్లో సైకిల్‌పై తిప్పుతూ కేజీ బీరకాయలు 20రూపాయలకు అమ్ముకుంటున్నాను. - జొన్నాడ రాము, కూరగాయల రైతు, బంగారమ్మపేట పెట్టుబడులైనా రాలేదు గడచిన ఐదేళ్లుగా బీరకాయలు సాగు చేస్తున్నాను. పండించిన మొదటి రెండు మూడు సంవత్సరాలూ పంట దిగుబడితోపాటు మద్దతు ధర కూడా బాగుండేది. ఇప్పుడు కేజీ బీరకాయలు మూడు నుంచి నాలుగు రూపాయలకే అమ్మాల్సి వస్తోంది. - సుంకరి సన్యాసి, కూరగాయల రైతు, బంగారమ్మపేట -
బీరకాయ బదులు...
పిట్ట గోడ వనజ: పిన్నిగారూ, మా ఆయనకి బీరకాయ కూరంటే చాలా ఇష్టం. పిన్నిగారు: అదికాదే అమ్మాయ్, అల్లుళ్లకి గుత్తి వంకాయ కూరంటే ఇష్టముండాలికానీ, ఈ బీరకాయ కూర గొడవేంటి..? వనజ: అది కాదు పిన్నిగారూ, బీరకాయ కూరలో దండిగా ఉల్లిపాయలు తరిగి వేస్తే నాలుకకి బీరకాయ, పంటికి ఉల్లిపాయ తగిలి భేషుగ్గా ఉంటుందని ఆయనంటూ ఉంటారు. పిన్నిగారు: ఇక్కడేదో తేడా కొడుతోందే అమ్మాయ్! ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు! వనజ: మా వారు సహృదయులు. ‘ఎందుకులే వనజా! వెధవది, బీరకాయ ఊరికే దొరుకుతుంది కానీ, ఉల్లిపాయల ధర మండిపోతోంది. మరీ ఉల్లిపాయ లేకుండా బీరకాయ ఏం తింటాం... అందుకే ఇవాళ్టికి బీరకాయ బదులు బీరు కాయతో సర్దుకుపోదాం’ అంటూ అలా బజారులోకి వెళ్లారు.