మాట్లాడుతున్న ఆకుల రామకృష్ణ
హామీలు అమలు చేయకపోవడం శోచనీయం
Published Wed, Sep 7 2016 12:19 AM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
శ్రీకాకుళం అర్బన్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల గడువు ముగిసినా అమలు చేయకపోవడం శోచనీయమని రాష్ట్ర కాపు జేఏసీ నేతలు అన్నారు. రాష్ట్రంలోని కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులను బీసీల్లో చేర్చకపోవడాన్ని నిరసిస్తూ రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 11న రాజమండ్రిలో రాష్ట్రస్థాయి జేఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద వైఎస్సార్ కల్యాణ మండపంలో జిల్లా తెలగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధి ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ ఒడిషా, తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్రలలో కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులు బీసీ జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక్కడ మాత్రం ఓసీలుగానే పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర జేఏసీ నేత నల్లా విష్ణుమూర్తి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొంతమంది ప్రతినిధులు స్థాయిని మరిచి ముద్రగడను విమర్శించడం దారుణమన్నారు. రాష్ట్ర జేఏసీ నేత తోట రాజీవ్ మాట్లాడుతూ కాపులు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులు ఐక్యంగా పోరాడాలన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు సంఘ ప్రతినిధి సురంగి మోహనరావు, రాష్ట్ర కాపు జేఏసీ నేత ఇమిడి జోగేశ్వరరావు, కాపు నేతలు మామిడి శ్రీకాంత్, కరణం శ్రీనివాసరావు, తెలగ సంఘ ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ, వడిశ బాలకృష్ణ, శవ్వాన ఉమామహేశ్వరి, శవ్వాన వెంకటేశ్వరరావు, సుంకరి క1ష్ణ, పిల్లల నీలాద్రి, సిగిరెడ్డి నాగు, డాక్టర్ ఖగేశ్వరరావు, బత్తుల లక్ష్మణరావు, బత్తుల వైకుంఠరావు, బస్వా హరినారాయణ, అత్తులూరి మురళి, బల్ల రామారావు, రొక్కం శ్రీనివాసరావు, జిల్లాలోని 38 మండలాల తెలగ సంఘ అధ్యక్షులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement