ఏపూరులో దొంగల బీభత్సం
ఏపూరులో దొంగల బీభత్సం
Published Mon, Dec 5 2016 3:02 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
ఆత్మకూర్ (ఎస్) : మండల పరిధిలోని ఏపూరు గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడి నగదుతో పాటు బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ... గ్రామానికి చెందిన తొండల శ్రీను, ఎస్‌కే.సత్తార్, కాశబోరుున భద్రమ్మ ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వరుసగా ఈ ఇళ్లలో దుండగులు చొరబడ్డారు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందరగా పడేశారు. తొండల శ్రీను ఇంట్లో బీరువాను పగులగొట్టి రూ.20 వేల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. ఈ ఇంటికి ఎదురుగా ఏపూరు ప్రధాన రహదారిపై ఉన్న భద్రమ్మ గృహంలో రూ.7వేలను దొంగిలించారు. తొండల శ్రీను ఇంటి పక్కనే ఉన్న సత్తార్ ఇంటికి సంబంధించిన ఇంటి తాళాలు పగులగొట్టారు. ఇంట్లో ఏమీ లేకపోవడంతో వస్తువులు, దుస్తులు చిందరవందరంగా పడేసి వెళ్లారు.
పక్కా సమాచారం ప్రకారమేనా ?
చోరీ జరిగిన ఇళ్లలో బాధితులు ఎవరూ లేరు. అందరి ఇళ్లకు తాళాలు వేసి ఉండడంతో తెలిసిన వారి పనేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. తొండల శ్రీను గ్రామంలో కూల్‌డ్రింక్ షాపు నిర్వహిస్తూ 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో కాలు, చేయి విరిగి గ్రామంలోని తమ పాత ఇంట్లో శ్రీను దంపతులు ఇద్దరూ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. అలాగే సత్తార్ తన ఇంటి సమీపంలోని పాత ఇంట్లో రాత్రి సమయంలో నిద్రిస్తున్నారు. కాశబోయిన భద్రమ్మ తన బంధువుల ఇంటికి వెళ్లగా ఈ విషయాన్ని పూర్తిగా గమనించిన దుండగులు పక్కా సమాచారం మేరకు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా వెలుగులోకి ...
అర్ధరాత్రి సమయంలో ఈ మూడు ఇళ్లలో చోరీ జరగగా ఉదయం 6 గంటల సమయంలో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టూ పక్కల ఇళ్ల వారు నిద్రలేచి తాళాలు పగులగొట్టడం చూసి బాధితులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరికృష్ణ సిబ్బందితో కలిసి చోరీ జరిగిన ఇళ్ల పరిసరాలను పరిశీలించారు. దుండగులు వదిలేసిన కర్రలు, కండువాలను స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ నుంచి క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
అంతర్ రాష్ట్ర ముఠా పనేనా ?
ఈ చోరీ అంతర్ రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. మండల పరిధిలోని ఏపూరుతో పాటు నూతనకల్ మండలం అలుగునూరు, వరంగల్ జిల్లా తిరుమలయపాలెం గ్రామాల్లో అదే రాత్రి చోరీలు జరిగాయి. దీంతో స్థానిక పరిస్థితులు తెలిసిన అంతర్ రాష్ట్ర ముఠా చోరీకీ పాల్పడినట్లు పోలీసులు భావించి ఆ దిశగా విచారణ చేపడుతున్నారు.
Advertisement
Advertisement