మూతపడిన సీసీ కెమెరాల గది
⇒ మహానందిలో మూడు రోజులుగా పనిచేయని సీసీ కెమెరాలు
⇒ పట్టించుకోని ఉన్నతాధికారి
మహానంది: మహానంది పుణ్యక్షేత్రంలో నిఘా నేత్రాలు మూడురోజులుగా మూతపడ్డాయి. వర్షం వస్తుండడంతో వైర్లు పాడవుతాయంటూ నిఘా వ్యవస్థనే మూసేయడం గమనార్హం. ఆలయంలో హుండీలు, రూ. లక్షల విలువైన ఆభరణాలు ఉండటం, వేలాదిగా భక్తులు దర్శనానికి వస్తుండడం, కోనేరుల వద్ద తరచూ చోరీలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఇలా సీసీ కెమెరాలను మూసేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆలయ భద్రతపై ప్రత్యేక దష్టి పెట్టామని, మరో 22 సీసీ కెమెరాలు వస్తున్నాయని ప్రకటనలు చేస్తున్న ఉన్నతాధికారులు వర్షం సాకుతో వాటిని నిలిపేయడం గమనార్హం.
మహానందిలో ఆలయ, భక్తుల భద్రత దష్ట్యా సుమారు 24 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు ఇదివరకటి నుంచే పని చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుత వర్షాల కారణంగా మిగతా కెమెరాలు కూడా పనిచేయడం లేదు. వర్షం వస్తుండడంతో సర్వర్ ఆఫ్ చేశామని, విషయాన్ని ఉన్నతాధికారికి తెలియజేశామని అక్కడి తాత్కాలిక ఉద్యోగి శివ సాక్షికి తెలిపారు. క్షేత్రంలో సీసీ కెమెరాల ఆపరేటింగ్ సిస్టమ్ నిలిపేయడం దారుణమని, ఏదైనా జరగరాని ఘటనలు జరిగితే ఎవరు బాధ్యులంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే వరుసగా నాలుగు చోరీలు జరిగాయి. శనివారం సెల్‌ఫోన్ లాకర్ల వద్ద సిబ్బంది, భక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో వాటి వివరాలు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన ఉద్యోగి.. వేళలు పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి.
సెల్‌ఫోన్ లాకర్ల వద్ద వాగ్వాదం..
గుడి తలుపులు మూసేస్తారన్న విషయం చెప్పకుండా సెల్‌ఫోన్లను లాకర్‌లో ఉంచుకున్న విషయంపై శనివారం భక్తులు, అక్కడి సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటర్ వద్ద రశీదు పుస్తకం చించేయడంతో సిబ్బంది వాదనకు దిగారని కాంట్రాక్టర్ తెలిపారు. విషయంపై ఈఓతో మాట్లాడగా విచారణ చేపడతామని తెలిపారు.