ఘనంగా ఏకాదశి వేడుకలు
పుట్టపర్తి టౌన్ : ప్రశాంతి నిలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలలో మహారాష్ట్ర , గోవాకు చెందిన వేలాది భక్తులు పాల్గొన్నారు. మహారాష్ట్ర సత్యసాయి భక్తులు తమకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆశాడ ఏకాదశి వేడుకలు ప్రశాంతి నిలయంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం ఉదయం సత్యసాయి మహా సమాధి చెంత మహారాష్ట్ర భక్తుల వేదఠనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. పండరీనాథున్ని, సత్యసాయిని కొనియాడుతూ భక్తిగీతాలు ఆలపించారు.
సాయంత్రం మహారాష్ట్రకు చెందిన బాలవికాస్ విద్యార్థులు ‘గాడ్ లక్కీ నెంబర్ 9’అన్న పేరుతో సంగీత నృత్యరూపకం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు ప్రదర్శించిన హిరణ్య కషిపుడు, భక్త ప్రహల్లాదుల ఘట్టం భక్తుల హృదయాలను చలింపజేసింది. తర్వాత భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. వేడుకలను పురస్కరించుకుని సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.