
మార్మోగిన సాయి నామస్మరణ
పుట్టపర్తి అర్బన్ : విజయనగరం జిల్లా వాసులు చేసిన సాయి నామస్మరణతో పుట్టపర్తి వీధులు పులకించాయి. పర్తియాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్న విజయనగరం జిల్లా సత్యసాయి భక్తులు స్వామివారి పల్లకీని ఊరేగిస్తూ ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విజయనగరం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన సాయి భక్త బృందం పుట్టపర్తికి విచ్చేశారు. సత్యసాయి చిత్రపటాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై పట్టణంలోని గణేష్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, గోపురం వీధి, హనుమాన్ ఆలయం తదితర చోట్ల ఊరేగించారు. కార్యక్రమంలో కోలాటం, చెక్కభజన చేస్తూ మహిళలు ఆడిపాడారు. అనంతరం సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.