ఆ విత్తనాలు నకిలీవే..
ఆ విత్తనాలు నకిలీవే..
Published Wed, Oct 5 2016 5:55 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM
నిర్ధారించిన అధికారులు, శాస్త్రవేత్తలు
బండారుపల్లి (తాడికొండ రూరల్): తాడికొండ మండలం బండారుపల్లి గ్రామంలో 1000 ఎకరాలలో పూత, పిందె లేకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తున్న విత్తనం నకిలీదేనని అధికారులు నిర్ధారించారు. మంగళవారం గ్రామంలో శాస్త్రవేత్తలు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించిన అనంతరం నకిలీ విత్తనంగా తేల్చారు. మొత్తం 80 క్వింటాళ్ళకు పైగా బ్రహ్మపుత్ర–555 విత్తనాన్ని తమకు అంటగట్టారని పలువురు రైతులు గగ్గోలు పెట్టారు. ఇప్పటికే ఎకరాకు లక్షకు పైగా పెట్టుబడి రూపంలో పెట్టామని, తమకు పరిహారం వచ్చేలా విత్తన కంపెనీపై చర్యలు తీసుకోపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. లాంఫాం శాస్త్రవేత్త శారద, ఉద్యానశాఖ డీడీఏ జయచంద్రారెడ్డితో కలిసి పలువురు అధికారులు మిరప పంటను పరిశీలించిన అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. బిల్లులు, విత్తన సంచుల ఆధారంగా రైతుల వద్ద నుంచి ఫిర్యాదులు సేకరించి కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు, వ్యవసాయాధికారి మన్నవ నాగరాజు, ఉద్యాన శాఖాధికారి రవిప్రకాష్, మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ శివరామకృష్ణ, జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి కంచర్ల శివరామయ్య, మాజీ సొసైటీ అధ్యక్షుడు మానుకొండ రత్తయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement