యాసిడి దాడి చేసిన ఒకరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ హరినాథ్ మంగళవారం తీర్పు చెప్పారు.
నిజామాబాద్ లీగల్(నిజామాబాద్‌అర్బన్): యాసిడి దాడి చేసిన ఒకరికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ హరినాథ్ మంగళవారం తీర్పు చెప్పారు. ఈ ఘటన వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ రత్నాకర్‌రెడ్డి తెలిపారు. నగరంలోని ఖిల్లారోడ్డుకు చెందిన షేక్ మొయిజ్ వివాహం నగరంలోని పాములబస్తీకి చెందిన ఫిర్దోసీతో ఖాయమైంది. వివాహం 2013 ఏప్రిల్ 12న జరగాల్సి ఉంది. ఫిర్దోసీ బావ నెహ్రూనగర్(సారంగాపూర్)కు చెందిన ఖలీల్ తన మరదలను వివాహం చేసుకోవాలనుకున్నాడు. షేక్ మొయిజ్‌తో తన మరదలు పెళ్లి ఎలాగైనా ఆపాలని కుట్ర పన్నాడు.
దీనిలో భాగంగా 2013 ఏప్రిల్ 11న తెల్లవారుజామున షేక్ మొయిజ్ ఇంటికి వెళ్లి ఓ కరెంట్ స్తంభానికి వైరు వేసి దీనిని మొయిజ్ ఇంటిగేట్‌కు అంటించాడు. తెల్లవారాక మొయిజ్ తండ్రి షేక్ హుస్సేన్ గేట్ తీసి బయటకు వచ్చేందుకు యత్నించగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో అతడికి స్వల్పగాయమైంది. అనంతరం అదే రోజు సాయంత్రం పెళ్లి కొడుకు మొయిజ్ తన సోదరుడితో కలిసి రైల్వేస్టేషన్ వద్ద పూల కోసం వచ్చాడు. అంతకు ముందే ఖలీల్ మొయిజ్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని యాసిడ్ బాటిల్ దగ్గర పెట్టుకుని అతడి కోసం వెతుకుతుండగా రైల్వేస్టేషన్ వద్ద కనిపించాడు.
మొయిజ్ వద్దకు ఖలీల్ వచ్చి అతడి ముఖంపై యాసిడ్ పోసి పారిపోయాడు. దీనిపై తండ్రి హుస్సేన్ ఖలీల్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఖలీల్‌ను పట్టుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు ఖలీల్‌పై అభియోగపత్రాలు కోర్టులో సమర్పించగా జడ్జి ఎంవీ హరినాథ్ సాక్షులను విచారించారు. ఖలీల్ చేసిన నేరం రుజువైంది. దీంతో అతడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధిస్తూ తీర్చు చెప్పారు. ఒకవేళ జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాదిపాటు జైల్ శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. ఈ కేసులో పోలీసుల తరపున పీపీ రత్నాకర్‌రెడ్డి వాధించారు.