జీఎస్‌బీసీకి తుంగభద్ర జలాలు
కృష్ణా, తుంగభద్ర నీటితో
కళకళలాడుతున్న కాలువ
జీఎస్‌బీసీ ట్రఫ్ట్ వద్ద పైపింగ్
వృథాగా పోతున్న నీరు
గుంతకల్లు టౌన్: గుత్తి సబ్‌బ్రాంచ్ కెనాల్‌కు శనివారం తెల్లవారుజామున తుంగభద్ర జలాలు వచ్చి చేరాయి. పట్టణ ప్రజలకు తాగునీటిని పంపింగ్ చేసుకోవడానికి హంద్రీ నీవా నుంచి కృష్ణా జలాలను జీఎస్‌బీసీలోకి వారం కిందట మళ్లించిన విషయం విదితమే. దీంతో ఓ వైపు కృష్ణా జలాలు, మరోవైపు తుంగభద్ర జలాలు జీఎస్‌బీసీలో పరవళ్లు తొక్కుతున్నాయి. కెనాల్‌లో నీటి ఉధృతి పెరిగి గట్లు తెగిపోకుండా 0.0 కి.మీ వద్ద ఏబీసీ షట్టర్లను ఎత్తి ఆ నీటిని ఆలూరు బ్రాంచ్ కెనాల్ వైపునకు మళ్లించారు. నీటి ఉధృతిని తగ్గించడానికి కొట్టాల బ్రిడ్జి వద్ద కూడా మున్సిపాల్టీ వారు జీఎస్‌బీసీ కెనాల్‌లో ఇసుక, డస్ట్ సంచులను పేర్చారు.
అయినప్పటికీ రైల్వే బ్రిడ్జి వద్దనున్న ట్రఫ్ట్‌కు గండిపడి పెద్ద ఎత్తున నీరు వంకల్లోకి వృథాగా పోతోంది. అసంపూర్తిగా చేపట్టిన పూడికతీత పనులు, దెబ్బతిన్న లైనింగ్ కారణంగా కెనాల్‌కు అడుగడుగునా లీకేజీలు ఏర్పాడ్డాయి. గుంతకల్లు మున్సిపాల్టీకీ తాగునీటి అవసరాలకై రెండు ఎస్‌ఎస్ ట్యాంకులను నింపడానికి మొత్తం 0.45 టీఎంసీల నీటిని కేటాయించారు. తుంగభద్రలో నీటిమట్టం పెరగకపోవడంతో ఈ సారి కూడా ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు ఎస్‌ఎస్ ట్యాంకులు పూర్తిగా నిండేవరకు తుంగభద్ర జలాలను విడుదల చేస్తామని జీఎస్‌బీసీ డిఇ చంద్రశేఖర్ వెల్లడించారు.