thungabhadra water
-
‘అహోబిలం’ ప్రాజెక్టును నిలిపివేయండి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాలను వాడుకుంటూ ఏపీ చేపట్టిన పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపి వేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఎస్కే జోషి కేంద్ర జలవనరుల శాఖను కోరారు. దిగువనున్న తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్మాణాన్ని ఆపేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని విన్నవించారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలోని రాజోలిబండ మళ్లింపు పథకం పూర్తిగా తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉందన్నారు. ఇక కృష్ణా ప్రవాహాలకు తుంగభద్ర ప్రధాన నీటి వనరని , కృష్ణా జలాలపై రాష్ట్రంలో కల్వకుర్తి ఎత్తిపోతల, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తుంగభద్ర నుంచి 40 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఏపీ అనంతపురం నీటి అవసరాల కోసం పెన్నా అహోబిలం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిందని, దీనివల్ల దిగువనున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపారు. ఇదే విషయమై మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఆర్డీఎస్ రైతులకు తుంగభద్ర జలాలు
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) పథకం పరిధిలోని ఆయకట్టు రైతులకు శుభవార్త. వారికి ఒక ట్రెండు రోజుల్లో తుంగభద్ర జలాలు విడు దల కానున్నాయి. సుమారు 7వేల ఎక రాల్లో వేసిన ఆరుతడి పంటలకు ఈ నీరం దే అవకాశం ఉంది. తుంగభద్ర జలాల్లో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాల అంశమై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఏపీ మంత్రి దేవినేనితో బుధ వారం ఫోన్లో మాట్లాడారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై చర్చిం చారు. నీటి విడుదలకు సంయుక్తంగా ఇండెంట్ ఇద్దామని, దీనిద్వారా ఇటు ఆర్డీఎస్కు అటు సుంకేసులకు నీరు చేరుతుందని తెలిపారు. హరీశ్ ప్రతి పాద నకు దేవినేని సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సంయుక్తంగా తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ సమర్పించి నీటిని కోరాలని ఇరువురు మంత్రులు నిర్ణయించారు. -
జలం.. జులుం!
తుంగభద్రకు సంకెళ్లు! - నీటి కేటాయింపుల్లో ఏటా వివక్ష - 32.5 టీఎంసీల్లో వచ్చేది 22 టీఎంసీలే - కేసీ వాటాలోనూ భారీగా కోత - తాగు, సాగునీటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి - ఈ ఏడాది డ్యాంలో కనీసస్థాయి నీటి నిల్వలు - ఆందోళనలో సీమ రైతాంగం సాక్షిప్రతినిధి, అనంతపురం: తుంగభద్ర జలాల కేటాయింపులో రాయలసీమకు ఏటా అన్యాయం జరుగుతోంది. కేటాయింపులకు భిన్నంగా నీటి విడుదల తగ్గిపోతోంది. వదిలిన నీటిని కూడా కర్ణాటక రైతులు జల చౌర్యానికి పాల్పడుతుండటంతో ఇక్కడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరి రైతుల మధ్య గొడవకు కారణమవుతోంది. హెచ్ఎల్సీ కాలువకు 32.5 టీఎంసీల నికర జలాలను తుంగభద్ర బోర్డు కేటాయించింది. ఈ నీటిపై ఆధారపడి ‘సీమ’లోని అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో 2.84లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. అయితే టీబీ బోర్డు మాత్రం 32.5 టీఎంసీలలో ఏటా సగటున 22 టీఎంసీలు మాత్రమే కేటాయిస్తోంది. ఈ మేరకు కూడా అధికారులు నీటిని అందించలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేసీ కెనాల్‌కు దక్కాల్సిన 10 టీఎంసీల నీటిని హెచ్ఎల్సీ ద్వారా మళ్లించేందుకు జీఓ జారీ చేశారు. అంటే.. హెచ్ఎల్సీ ద్వారా మొత్తం 42.5 టీఎంసీల నీళ్లు సీమకు దక్కాల్సి ఉంది. కేసీ కెనాల్ వాటాలో కూడా ఏటా 4 టీఎంసీలు మాత్రమే బోర్డు విడుదల చేస్తోంది. దీంతో 10.5 టీఎంసీలు హెచ్ఎల్సీ కోటా, 6 టీఎంసీలు కేసీ కెనాల్ కోటాను సీమ కోల్పోతోంది. అటు జల చౌర్యం.. ఇటు సర్కారు నిర్లక్ష్యం హెచ్ఎల్సీకి సగటున 22 టీఎంసీలు.. కేసీ కెనాల్ కోటాలో మరో 4 టీఎంసీలు కలిపి ఏటా సగటున 26 టీఎంసీలు కేటాయిస్తున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నుంచి ఏపీ సరిహద్దు వరకు 105 కిలోమీటర్ల మేర కాలువ కర్ణాటకలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలోని రైతులు ఏటా జలచౌర్యానికి పాల్పడుతున్నారు. 105 కిలోమీటర్ల మేర కాలువలోకి పైపులు వేసుకుని మోటార్ల ద్వారా నీటిని సమీప పొలాలకు వినియోగించుకుంటున్నారు. ఈ కారణంగా 105 కిలోమీటర్ వచ్చేలోపు నీటి ప్రవాహం మందగిస్తోంది. హెచ్ఎల్సీ నుంచి ఆలూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కర్నూలుకు, పీబీసీ(పులివెందుల బ్రాంచ్ కెనాల్), మైలవరం బ్రాంచ్ కెనాల్ ద్వారా వైఎస్సార్ జిల్లాకు తుంగభద్ర జలాలు చేరాలి. విడుదల చేసిన జలాలు కాలువ చివరి ఆయకట్టు వరకూ వెళ్లడం లేదు. దీంతో తమ వాటా జలాలు దక్కడం లేని ఈ రెండు జిల్లాల రైతులు ఏటా ఆందోళనలు చేపడుతున్నారు. ఆరేళ్లుగా పీబీసీ ఆయకట్టుకు చుక్కనీరు లేదు పీబీసీకి 4.4 టీఎంసీల నీరు అందాలి. దీని కింద 55వేల ఎకరాలకు నీళ్లు అందివ్వాలి. అయితే డ్యాంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందనే కారణంతో ఏటా సగటున 1.9 టీఎంసీలు కేటాయిస్తున్నారు. ఈ నీళ్లన్నీ తాగునీటికే సరిపోతున్నాయి. దీంతో పులివెందుల ప్రాంతంలో పండ్లతోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చీనీ, అరటిసాగు చేస్తున్న రైతులు ఏటా పీబీసీ నీరు వస్తుందని ఆశపడటం, నీరు రాకపోవడంతో చెట్లను బతికించుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసుకోవడం ఆనవాయితీగా మారింది. మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు 1.7టీఎంసీలు కేటాయించాలి. కొన్నేళ్లుగా ఈ కాలువకు చుక్కనీరు కేటాయించట్లేదు. గతేడాది మరీ దారుణం ఐఏబీ సమావేశంలో గతేడాది హెచ్ఎల్సీకి 23.1 టీఎంసీల నీరు కేటాయించారు. ఇందులో 8.5 టీఎంసీలు తాగునీటికి, 14.6టీఎంసీలు సాగుకు కేటాయించారు. హెచ్ఎల్సీ కింద మొత్తం 2.84లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. కానీ చివరకు 11 టీఎంసీలు మాత్రమే విడుదల చేశారు. నష్టాలు పోను ‘అనంత’కు 9.5 టీఎంసీలు మాత్రమే చేరాయి. హంద్రీనీవా ద్వారా గతేడాది 28టీఎంసీల నీళ్లు జిల్లాకు చేరాయి. ఈ నీటిని ఏపీబీఆర్(పెన్నహోబిళం బ్యాలెన్స్ రిజర్వాయర్)కు మళ్లించి హెచ్ఎల్సీకి తరలించారు. కానీ ఆయకట్టుకు మాత్రం ఇవ్వలేదు. చెరువులను నింపే పేరుతో జలాలను మొత్తం వృథా చేశారు. 28 టీఎంసీల నీటితో కనీసం 28 ఎకరాలకు కూడా నీరు అందించలేదంటే నీటి వినియోగంపై ప్రభుత్వానికి ఏమేరకు ప్రణాళిక ఉందో, రైతుల శ్రేయస్సుపై చిత్తశుద్ధి ఏంటో ఇట్టే తెలుస్తుంది. ఈ ఏడాది కలవరపెడుతున్న తుంగభద్ర గతేడాది నీటి లభ్యత తక్కువ కారణంగా ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొనే ప్రమాదం కన్పిస్తోంది. ప్రస్తుతం డ్యాంకు 16వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 35.59 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది జరిగే ఐఏబీ సమావేశంలో కేటాయింపులు తక్కువగా ఉంటాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. గత ఐదేళ్లుగా హెచ్ఎల్సీకి నీటి కేటాయింపులు ఇలా: సంవత్సరం నీటి కేటాయింపులు విడుదలైంది కేసీ కెనాల్ వాటా(తాగునీటికి) 2011–12 23.426 20.186 2.941 2012–13 18.856 15.947 3.300 2013–14 22.075 22.075 4.500 2014–15 21.156 18.093 4.00 2015–16 16.863 15.997 1.000 2016–17 23.1 9.5 0 -
జీఎస్‌బీసీకి తుంగభద్ర జలాలు
కృష్ణా, తుంగభద్ర నీటితో కళకళలాడుతున్న కాలువ జీఎస్‌బీసీ ట్రఫ్ట్ వద్ద పైపింగ్ వృథాగా పోతున్న నీరు గుంతకల్లు టౌన్: గుత్తి సబ్‌బ్రాంచ్ కెనాల్‌కు శనివారం తెల్లవారుజామున తుంగభద్ర జలాలు వచ్చి చేరాయి. పట్టణ ప్రజలకు తాగునీటిని పంపింగ్ చేసుకోవడానికి హంద్రీ నీవా నుంచి కృష్ణా జలాలను జీఎస్బీసీలోకి వారం కిందట మళ్లించిన విషయం విదితమే. దీంతో ఓ వైపు కృష్ణా జలాలు, మరోవైపు తుంగభద్ర జలాలు జీఎస్బీసీలో పరవళ్లు తొక్కుతున్నాయి. కెనాల్లో నీటి ఉధృతి పెరిగి గట్లు తెగిపోకుండా 0.0 కి.మీ వద్ద ఏబీసీ షట్టర్లను ఎత్తి ఆ నీటిని ఆలూరు బ్రాంచ్ కెనాల్ వైపునకు మళ్లించారు. నీటి ఉధృతిని తగ్గించడానికి కొట్టాల బ్రిడ్జి వద్ద కూడా మున్సిపాల్టీ వారు జీఎస్‌బీసీ కెనాల్లో ఇసుక, డస్ట్ సంచులను పేర్చారు. అయినప్పటికీ రైల్వే బ్రిడ్జి వద్దనున్న ట్రఫ్ట్కు గండిపడి పెద్ద ఎత్తున నీరు వంకల్లోకి వృథాగా పోతోంది. అసంపూర్తిగా చేపట్టిన పూడికతీత పనులు, దెబ్బతిన్న లైనింగ్ కారణంగా కెనాల్‌కు అడుగడుగునా లీకేజీలు ఏర్పాడ్డాయి. గుంతకల్లు మున్సిపాల్టీకీ తాగునీటి అవసరాలకై రెండు ఎస్ఎస్ ట్యాంకులను నింపడానికి మొత్తం 0.45 టీఎంసీల నీటిని కేటాయించారు. తుంగభద్రలో నీటిమట్టం పెరగకపోవడంతో ఈ సారి కూడా ఆయకట్టుకు చుక్కనీరు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. రెండు ఎస్ఎస్ ట్యాంకులు పూర్తిగా నిండేవరకు తుంగభద్ర జలాలను విడుదల చేస్తామని జీఎస్‌బీసీ డిఇ చంద్రశేఖర్ వెల్లడించారు. -
పీఏబీఆర్‌లోకి తుంగభద్ర జలాలు
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం)లోకి తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా వస్తున్న నీరు శనివారం చేరింది. సుమారు 860 క్యూసెక్కులు నీరు వస్తున్నట్లు డ్యాం డీఈ పక్కీరప్ప తెలిపారు. తుంగభద్ర జలాల రాకతో డ్యాంలో నీటి మట్టం పెరగనుంది. ప్రస్తుతం డ్యాంలో నీటి మట్టం 1.74 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నిల్వ ఉన్న నీటి నుంచి డ్యాంలో ఏర్పాటు చేసిన అనంత తాగునీటి పథకానికి, సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్టులకు రోజుకు సుమారు 70 క్యూసెక్కుల వరకు నీటిని సర ఫరా చేస్తున్నారు. డ్యాంలో నీటి మట్టం పెరిగితే జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ తయారీ ప్రారంభం కానుంది.