వేలానికి వేళాయే!
♦ మరోసారి భూముల అమ్మకానికి సన్నాహాలు
♦ జంట జిల్లాల్లో 16 చోట్ల స్థలాలు గుర్తింపు
♦ మలి జాబితాలో పుప్పాల్‌గూడలో 100 ఎకరాలు
♦ అప్‌సెట్ ధరను ఖరారు చేయాలని ఆదేశం
♦ జిల్లా యంత్రాంగానికి అందిన లేఖ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : మరోసారి భూముల వేలానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. విశ్వనగరంగా మలిచేందుకు అవసరమైన నిధుల సమీకరణకు భూముల అమ్మకమే ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్న సర్కారు.. నగర శివార్లలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోయే స్థలాల గుర్తించే ప్రక్రియను మొదలుపెట్టింది. గతేడాది రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మండలాల్లోని 16 పార్శిళ్లలో భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ.350 కోట్లు సమకూర్చుకున్న ప్రభుత్వం తాజాగా ఆరు చోట్ల 6.70 ఎకరాలను అమ్మకానికి ప్రణాళిక తయారు చేసింది. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విలువైన భూముల జాబితాపై చర్చ జరిగింది.
దీంట్లో జల్లెడ పట్టిన ప్రభుత్వం రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలోని ఖరీదైన ప్రాంతాల్లో ఆరు పార్శిళ్లను విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అప్‌సెట్ ప్రైస్‌ను ఖరారుచేసే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి కట్టబెట్టింది. వాస్తవానికి జిల్లావ్యాప్తంగా 213 బిట్లలో 938 ఎకరాల అమ్మకంతో రూ.3,440 కోట్లు వస్తుందని అధికారయంత్రాంగం లెక్క గట్టింది. ఇందులో రెండు వేల ఎకరాల యూఎల్‌సీ భూములను కూడా చేర్చింది. అయితే, ఈ భూముల వేలంపై వెనక్కి తగ్గిన సర్కారు.. రియల్ బూమ్‌కు అనుగుణంగా స్థలాల వేలాలను వేయాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే తొలి విడతలో కొంత మేర భూముల అమ్మకాన్ని చేపట్టిన సర్కారు.. తాజాగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కలిపి 16 పార్శిళ్లను విక్రయానికి ముహూర్తం ఖరారు చేస్తోంది.
త్వరలో పుప్పాల్‌గూడ భూములు
ప్రస్తుతం 32,428 చదరపు అడుగుల మేర ప్రభుత్వ భూముల వేలం వేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మలిదశలో పుప్పాల్‌గూడలో 100 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని అమ్మే దిశగా అడుగులు వేస్తోంది. కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ భూమిపై తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. బహుళ జాతి సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలకు చేరువలో ఉన్న ఈ భూమి విక్రయం ద్వారా ఖజానాను నింపుకోవచ్చని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈ భూములకు సంబంధించిన స్కెచ్, ఇతర వివరాలను తక్షణమే పంపాలని జిల్లా యంత్రాంగానికి టీఎస్‌ఐఐసీ లేఖ రాసింది. ఈ భూమి విక్ర యం ద్వారా కనిష్టంగా రూ.2,500 కోట్లు సమకూరుతాయని అంచనా వేస్తోంది.