టేక్మాల్‌లో సాగవుతున్న సోయాపంట
- సోయా చిక్కుడుతో సిరులు
- అంతర పంటల్లోనూ అనుకూలమే
- యాజమాన్య పద్ధతులతో దిగుబడి
- మెలకువలు పాటిస్తే మరింత మేలు
- టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్
టేక్మాల్: సోయా సాగు సమయమిదేనని, ఈ పంటతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (9949968674) తెలిపారు. సోయా పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చునని ఆయన చెబుతున్నారు. సోయా చిక్కుడు ఇతర పప్పు ధాన్యాల పంటల కంటే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా అత్యధిక శక్తిని చేకూర్చే పోషకాలను అందిస్తుందన్నారు.
యాజమాన్య పద్ధతులతో పాటు మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకి మించి ఎరువులను వాడకుండా సమయానుకూలంగా కలుపు నివారణ చేపట్టాలన్నారు. సోయా సాగు విధానంపై ఆయన రైతులకు అందించిన సలహా సూచనలు..
పంటకాలం:
ఖరీఫ్‌లో జూన్, జులై నెలల్లో, రబీలో అక్టోబర్, వేసవిలో ఫిబ్రవరిలో సోయా పంటను సాగు చేయవచ్చు.
రకాలు:
పీకే–472, ఎంఏసీఎస్–58, ఎంఎస్సీఎస్–124, జేఎస్–335, ఎల్‌ఎస్‌బీ–335, ఎల్‌ఎస్‌బీ–1, ఎంఏసీఎస్–450, పీకే–1029 వంటి తదితర రకాలు అన్ని కాలాల్లో సాగుకు అనుకూలిస్తాయి.
విత్తనం:
ఎకరాకు 25–30 కిలోలు నాటాలి. విత్తన మోతాదు–గింజ పరిమాణం, మొలక శాతంపై ఆధారపడి ఉంటుంది.
విత్తనశుద్ధి:
ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్, 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ప్రతి 8–10 కిలోల విత్తనానికి 200 గ్రాముల మేర రైబోపియం జపానికం విధానంలో విత్తనశుద్ధి చేసి నీడలో ఆరబెట్టాలి.
విత్తే దూరం:
తేలిక భూముల్లో, నల్లరేగడి భూముల్లో 225 సెంటీమీటర్లు, చదరపు మీటరుకు 40 మొక్కల చొప్పున ఎకరాకు లక్షా అరవై వేల మొక్కలు ఉండాలి.
ఎరువులు:
ఎకరాకు 12 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, 8 కిలోల గంధకాన్ని చివరి దుక్కిలో వేయాలి. భాస్వరపు ఎరువును సూపర్‌ఫాస్పేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యమవుతుంది.
కలుపు నివారణ, అంతరకృషి:
విత్తే ముందు ప్లుకోరాలిన్ 45 శాతం, ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం 1.3 నుంచి 1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ, మరుసటి రోజున కానీ పిచికారి చేయాలి. విత్తిన 20–25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. విత్తిన 25 రోజులకు క్విజాలాపాప్ ఇథైల్ 5 శాతం 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి గడ్డిజాతి మొక్కలను, ఇమజిథాపైర్ 10 శాతాన్ని 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి వెడల్పాకు, గడ్డిజాతి కలుపును నిర్మూలించుకోవచ్చు.
అంతర పంటలు:
సోయా చిక్కుడును కంది (1ః7), పత్తి, మొక్కొజొన్న (1ః1) ఇతర పండ్ల తోటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, ఆవాలు, మినుములు సాగుచేస్తే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు.
సస్యరక్షణ– పురుగులు
రసం పీల్చే పురుగులు:
ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వుకుళ్లు, తెల్లదోమ ద్వారా మోజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు మేర కలిపి పిచికారి చేయాలి.
ఆకుముడత పురుగు:
ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్‌ఫాస్ 2 మిల్లీలీటర్లను కలిపి పిచికారి చేయాలి.
సస్యరక్షణ–తెగుళ్లు
ఆకుమచ్చ తెగులు:
ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారి చేయాలి.
కుంకుమ తెగులు:
ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రదశలో తుప్పు రంగు పొడ ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటిలో 1 మిల్లీలీటరు హెక్సాకొనాజోల్ లేదా ప్రొపికొనాజోల్ కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2–3 సార్లు పిచికారి చేయాలి.
బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు:
ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగులోకి మారతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 1.5 గ్రాముల పౌషామైసిన్+15 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపి 2–3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. ఎల్‌ఎస్‌బీ–1, ఎంఏసీఎస్,–58, పీకే–472 రకాలు ఈ తెగులును అరికడతాయి.
మోజాయిక్ తెగులు:
తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. దీనివల్ల మొక్క పసుపు రంగులోకి మారుతుంది. నివారణకు లీటరు నీటికి 1గ్రాము ఎసిఫేట్‌ను కలిపి 2–3 సార్లు పిచికారి చేసి తెగులు వ్యాప్తి చేసే పురుగును నివారించవచ్చు.
మొవ్వుకుళ్లు తెగులు:
తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. ఇది సోకితే మొక్క మొవ్వు నుంచి ఎండిపోతుంది. తెగులును తట్టుకునే జేఎస్–335, పీకే–1029 రకాలను వాడాలి. చేనులో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కార్భసల్పాన్‌తో విత్తనశుద్ధి చేయాలి. ఇలా చేయడం ద్వారా తామర పురుగులను నివారించవచ్చు.