అందుబాటులోకి రానున్న తిరుమల ఘాట్ రోడ్లు
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఈవో డి.సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయన్నారు.
16వ తేదీన తిరుచానురులో పంచమి తీర్థం నిర్వహిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలో రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి రెండు ఘాట్ రోడ్డను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రెండవ ఘాట్రోడ్డులో ప్రమాదకర ప్రాంతాలను ముందుగా గుర్తించి... నిపుణులచే మరమ్మతులు చేయిస్తామన్నారు.