D Sambasiva Rao
-
బెల్టు షాపుల నియంత్రణ కోసం ఎక్సైజ్ శాఖ భేటీ
-
‘వారం రోజుల్లోగా బెల్టు షాపులను నియంత్రించాలి’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో మద్యం బెల్టు షాపులను పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అమలు పర్చడానికి ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. వారం రోజుల్లో రాష్ట్రంలో ఉన్న బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించాలని.. రేపటి నుంచే పని మొదలు పెట్టాలని స్పెషల్ సీఎస్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకూ ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని.. వాటిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీన్ని పూర్తిగా అరికట్టాలంటే గంజాయి సాగులో లేకుండా చూడాల్సిన బాధ్యత అబ్కారీ శాఖపై ఉందన్నారు. గ్రామానికో కానిస్టేబుల్ : ముకేశ్ కుమార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ సిబ్బంది అంతా గట్టిగా పనిచేస్తే బెల్టు షాపుల తొలగింపు అసాధ్యం కాదని కమిషనర్ ముకేశ్ కుమార్ మీనా అన్నారు. ప్రతి గ్రామంలోనూ మద్యం బెల్టు షాపుల ఎత్తివేతకు సమావేశాలు నిర్వహించాలని, నిర్వాహకులకు కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. బెల్టు షాపుల నియంత్రణ కోసం ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను.. మండలానికి ఎస్సైని బాధ్యులుగా నియమిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమించి బెల్టు షాపులు నిర్వహిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెల్టు షాపుల నిర్మూలనపై ప్రతిరోజు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బెల్టు షాపుల నియంత్రణలో నూరుశాతం ఫలితాలు సాధించిన సిబ్బందికి రివార్డులు అందజేసి సత్కరిస్తామని చెప్పారు. (చదవండి : ‘బెల్ట్’ తీయకుంటే లైసెన్స్ రద్దు) -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి:ఈవో
తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. శుక్రవారం తిరుమలలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... 2వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని... 3న ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మూడో తేదీన స్వామివారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకుర 24 గంటలూ ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయని సాంబశివరావు వెల్లడించారు. -
అంగ ప్రదక్షిణం చేసే భక్తులకు ఆధార్ తప్పనిసరి
టీటీడీ ఈవో సాంబశివరావు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణం చేసేందుకు టికెట్లు పొందే భక్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధికారులను మంగళవారం ఆదేశించారు. రోజూ పరిమితంగానే 750 టికెట్లు ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఈ టికెట్ల కేటాయింపులు ఆధార్‌తో అనుసంధానం చేయటం వల్ల రొటేషన్ పద్దతిలో అందరికీ ఉపయుక్తంగా ఉండేలా నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని చెప్పారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
అందుబాటులోకి రానున్న తిరుమల ఘాట్ రోడ్లు
తిరుమల: తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో ఈవో డి.సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ పర్వదినాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ బ్రహ్మోత్సవాలు 16వ తేదీతో ముగుస్తాయన్నారు. 16వ తేదీన తిరుచానురులో పంచమి తీర్థం నిర్వహిస్తామని సాంబశివరావు పేర్కొన్నారు. తిరుమలో రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి రెండు ఘాట్ రోడ్డను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రెండవ ఘాట్‌రోడ్డులో ప్రమాదకర ప్రాంతాలను ముందుగా గుర్తించి... నిపుణులచే మరమ్మతులు చేయిస్తామన్నారు. -
తిరుమలలో 9వ తేదీ నుంచి వరుణ యాగం
తిరుపతి : తిరుమల శ్రీవారి సేవా టిక్కెట్లు ఆన్లైన్లో నేటి నుంచి విక్రయిస్తున్నట్లు టీటీడీ ఈవో డి.సాంబశివరావు వెల్లడించారు. నవంబర్ 5వ తేదీ వరకు ఈ ఆన్లైన్ టిక్కెట్లు విక్రయిస్తామని తెలిపారు. శుక్రవారం తిరుపతిలో సాంబశివరావు విలేకర్లతో మాట్లాడుతూ... సెప్టెంబర్ 9 నుంచి 13 వరకు పార్వేటి మండపంలో వరుణ యాగాలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాల పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పారు. 8 లక్షల లడ్డూలు అదనంగా నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డి. సాంబశివరావు వివరించారు. గతంతో పోలిస్తే తిరుపతిలో భక్తులు గదుల వినియోగం 109 శాతం పెరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో తప్పిపోయిన వారి కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. దీనికి లాస్ట్ అండ్ ఫౌండ్ అని పేరు పెట్టినట్లు ఆయన విశదీకరించారు. టీటీడీలో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. అయితే టీటీడీలో ఉద్యోగాలు అంటూ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు ఈ సందర్భంగా డి.సాంబశివరావు సూచించారు. -
ఈడీపీ అధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల : ఈడీపీ అధికారులపై టీటీడీ కార్యనిర్వహాణాధికారి డి. సాంబశివరావు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రత్యేక దర్శనం టికెట్లు ఇష్టానుసారం విక్రయించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించి...భక్తులను ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై సాంబశివరావు మండిపడ్డారు. భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్లు తాత్కాలికంగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. శనివారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారుల తీరుపై వారు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి... క్యూలైన్లు రోడ్డుపైకి వచ్చాయి. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటలు, నడక దారిలో వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. -
వీజీటీఎం, విశాఖలకు మెట్రోరైలు
సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఉత్తర్వులు జారీ సాక్షి, హైదరాబాద్: విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం)తో పాటు విశాఖపట్నం నగరాలకు మెట్రోరైలు ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి తొలి అడుగు పడింది. వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టుతోపాటు విశాఖలో ప్రత్యేకించి మెట్రోరైలు ఏర్పాటుకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ను ఏర్పాటు చేస్తూ బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డి. సాంబశివరావు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వీజీటీఎం మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేశారు. తొలిదశలో 49 కిలోమీటర్లు: ఎంఆర్టీఎస్ (మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం)లో భాగంగా విజయవాడలో తొలి దశలో 49 కిలోమీటర్లు నిర్ణయించారు. దీనికోసం 2014 జూన్ 27న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోరడంతోపాటు, సాధ్యాసాధ్యాల పరిశీలనకు, పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టుకు సాయమందించాలని లేఖ రాశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ లేఖకు 2014 జులై 18 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిందన్నారు. విశాఖపట్నానికి 20 కిలోమీటర్లు: విశాఖపట్నం నగరానికీ మెట్రోరైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల పరిశీలనపై పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం పట్టణ పరిధిలో తొలిదశలో నాలుగు కారిడార్లుగా గుర్తించామని, అందులో 20 కిలోమీటర్లు మెట్రోరైలు ఏర్పాటుకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 20కిలోమీటర్ల ప్రాజెక్టు అత్యంత జనసమర్థం ఉన్న ప్రాంతంగా గుర్తించినట్టు తెలిపారు.