వీజీటీఎం, విశాఖలకు మెట్రోరైలు
సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి (వీజీటీఎం)తో పాటు విశాఖపట్నం నగరాలకు మెట్రోరైలు ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాల అధ్యయనానికి తొలి అడుగు పడింది. వీజీటీఎం మెట్రో రైలు ప్రాజెక్టుతోపాటు విశాఖలో ప్రత్యేకించి మెట్రోరైలు ఏర్పాటుకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ను ఏర్పాటు చేస్తూ బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి డి. సాంబశివరావు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో వీజీటీఎం మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్న నేపథ్యంలో ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్‌ను ఏర్పాటు చేశారు.
తొలిదశలో 49 కిలోమీటర్లు: ఎంఆర్‌టీఎస్ (మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం)లో భాగంగా విజయవాడలో తొలి దశలో 49 కిలోమీటర్లు నిర్ణయించారు. దీనికోసం 2014 జూన్ 27న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు మెట్రోరైలు ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోరడంతోపాటు, సాధ్యాసాధ్యాల పరిశీలనకు, పూర్తి వివరాలతో కూడిన ప్రాజెక్టు రిపోర్టుకు సాయమందించాలని లేఖ రాశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ లేఖకు 2014 జులై 18 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపిందన్నారు.
విశాఖపట్నానికి 20 కిలోమీటర్లు: విశాఖపట్నం నగరానికీ మెట్రోరైలు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల పరిశీలనపై పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం పట్టణ పరిధిలో తొలిదశలో నాలుగు కారిడార్లుగా గుర్తించామని, అందులో 20 కిలోమీటర్లు మెట్రోరైలు ఏర్పాటుకు నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ 20కిలోమీటర్ల ప్రాజెక్టు అత్యంత జనసమర్థం ఉన్న ప్రాంతంగా గుర్తించినట్టు తెలిపారు.