బెల్టుషాపులను నియంత్రించాలి
ఏలూరు అర్బన్ : జిల్లాలో బెల్టుషాపులను నియంత్రించాలని పలువురు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ను కోరారు. శుక్రవారం డయల్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన జిల్లా వాసులతో ఫోన్‌లో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి ప్రజలు ఫోన్ చేసి బెల్టుషాపుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని నియంత్రించాలని కోరారు. దీనికి స్పందించిన ఎస్పీ ఎకై ్సజ్ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి ఆ షాపులను నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. ఇంకొందరు ఫోన్ చేసి గణపతి నవరాత్రి ఏర్పాట్లు బాగా చేశారని ఎస్పీని అభినందించారు. ఏలూరు నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి స్థానిక ఫత్తేబాదలో రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి నిలువ ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి మరొకరు ఫోన్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులపై దృష్టి పెట్టాలని సూచించారు. గణపవరం నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 25 మంది ఫోన్ చేసి వారి సమస్యలు విన్నవించారు.