చెప్పు, డప్పు వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలి
చెప్పు, డప్పు వృత్తిదారులకు పింఛన్ ఇవ్వాలి
Published Mon, Sep 26 2016 9:09 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
మునగాల : తెలంగాణలో చెప్పు, డప్పును నమ్ముకునే వృత్తిదారులకు నెలకు రూ.రెండు వేల పింఛన్ ఇవ్వాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఏబీసీడీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని టీఎమ్మారీయస్ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఆదివారం రాత్రి మునగాలకు చేరుకొని స్థానిక గ్రంథాలయ శాఖ భవనంలో బసచేసింది. కాగా సోమవారం ఉదయం మునగాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మండల శాఖ అధ్యక్షుడు ఎల్.శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెల 18న జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం కొలనుపాక నుంచి ప్రారంభమైన పాదయాత్ర నవంబర్ 18న హైదరాబాద్‌లో ముగుస్తుందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే టీఎమ్మార్పీయస్ సన్నాహక సదస్సుకు అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్.మోహన్‌రావు, టీఎమ్మార్పీయస్ జిల్లా ఇన్‌చార్జి చింతా బాబు మాదిగ, నియోజక వర్గ ఇన్‌చార్జి అమరారపు శ్రీను, మండల పార్టీ కార్యదర్శి ఎల్.నాగబాబు పాల్గొన్నారు.
Advertisement