శ్రీశైలం నీటిని దిగువకు వదిలితే అడ్డుకుంటాం
కడప కార్పొరేషన్:
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి దిగువకు నీటిని వదిలితే రాయలసీమలోని అన్నిపక్షాలతో కలిసి డ్యామ్ దగ్గరే అడ్డుకుంటామని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కడప వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మేయర్ కె. సురే‹ష్‌బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో గతేడాది వర్షాభావం వల్ల కేసీ కెనాల్ పరిధిలోని లక్ష ఎకరాలు, తెలుగుగంగ పరిధిలో లక్షా డెబ్బైవేల ఎకరాలను రైతులు బీడు పెట్టుకొన్నారన్నారు. ఎగువన కురిసిన వాననీరంతా ప్రస్తుతం శ్రీశైలంలోకి చేరబోతోందన్నారు.
తెలంగాణకు పవర్ జనరేషన్‌కనో, కోస్తాకు తాగునీటి కోసమనో వంకపెట్టి కిందికి వదలకుండా ఈసారి ఇక్కడి రైతులకు నీరందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా ఎడారిగా మారే ప్రమాదముందన్నారు. గతేడాది శ్రీశైలానికి 57 టీఎంసీల నీరు వచ్చిందని, 570 లెవెల్ వరకూ నీటిని నిల్వ ఉంచి వెలుగోడు ప్రాజెక్టు నింపుకొనే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ, కోసాంధ్రవారు ఎడాపెడా నీటిని వాడుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు శ్రీశైలంలో 878 అడుగులకు నీరు చేరిందని, అందులో చుక్క నీటిని కిందికి వదిలినా సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే రిజర్వాయర్ వద్దే నీటిని అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. శ్రీశైలంలో 874 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించాలని, ఆపైన వచ్చే నీటిని ఇతర అవసరాలకు వాడుకొన్నా అభ్యంతరం లేదన్నారు. కోస్తాంధ్రకు నీటిని ఇవ్వడానికి పట్టిసీమ పూర్తయ్యింది కదా ఇక కృష్ణానీటితో ఏం అవసరమని సూటిగా ప్రశ్నించారు. గత ఏడాది 134 ఏళ్ల చరిత్ర కలిగిన కేసీకెనాల్‌కు ఇవ్వకుండా కృష్ణాడెల్డాకు రెండుకార్లకు నీరు ఇచ్చారని, వారేనా రైతులు...మమ్మల్ని ఎండగట్టి వారికి నీరివ్వడం ఎంతవరకు న్యాయమన్నారు. వారు కన్నబిడ్డలు...మేం సవతి బిడ్డలమా అని ప్రశ్నించారు.
కరువుపీడిత, వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోనే కృష్ణాబోర్డు కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అవినీతి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఎమ్మెల్యే అన్నారు. విద్యాసంస్థల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, ప్రభుత్వం నిధుల్లేవని కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయడం అత్యంత దారుణమన్నారు. ప్రస్తుతమున్న కార్పొరేట్ స్కూళ్లన్నీ టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలవేనని, అందుకోసమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదన్నారు. విదేశీయాత్రల కోసం వందల కోట్లు తగలేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం రూ.32కోట్లు కేటాయించకపోవడం దారుణమన్నారు.