పొగాకు @181
♦ కొండపి వేలం కేంద్రంలో రికార్డు ధర నమోదు
♦ ఏపీలోనే అత్యధికం అంటున్న అధికారులు
కొండపి: నియోజకవర్గ కేంద్రమైన కొండపిలోని పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం మేలి రకమైన పొగాకుకు రికార్డు ధర లభించింది. అత్యధికంగా కిలో 181 రూపాయలు పలికింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వేలం కేంద్రాల్లోకి ఇదే అత్యధిక ధర అని వేలం కేంద్రం నిర్వహణ అధికారి మధుసూదనరావు తెలిపారు. కొండపి వేలం కేంద్రం పరిధిలోని అక్కచెరువుపాలెం, గోగినేనిపాలెం, పైడిపాడు, చతుకుపాడు, అగ్రహారం గ్రామాల నుంచి శుక్రవారం రైతులు 692 బేళ్లు అమ్మకానికి తీసుకొచ్చారు.
వ్యాపారులు అందులో 482 బేళ్లు కొనుగోలు చేశారు. అత్యధిక ధర కిలో 181 రూపాయలు పలకగా అత్యల్ప ధర కేజీ 74 రూపాయలు పలికింది. సరాసరి ధర కేజీ 141.91 రైతుకు దక్కింది. ఇదిలా ఉండగా ఒకటీఅరా బేళ్లకు అత్యధిక ధర చూపుతున్న వ్యాపారులు మిగతావి తక్కువ ధరలకు కొంటున్నారనేది రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.