నేడు సర్వం బంద్
Published Thu, Sep 1 2016 11:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
– 12 కార్మిక సంఘాల పిలుపు
– బస్సు, ఆటోలు బంద్
– దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : సార్వత్రిక సమ్మె నేపథ్యంలో శుక్రవారం జిల్లాలో సర్వం బందు కానుంది. బస్సులు, ఆటోలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, విద్యుత్ కార్మికులు, దుకాణాల్లో పనిచేసే కార్మికులు, టైలర్ వర్కర్లు, మున్సిపల్ కార్మికులు, రైస్‌మిల్స్, ఆయిల్ మిల్స్ కార్మికులు, వివిధ ట్రాన్స్‌పోర్టు రవాణా వ్యవస్థలు సమ్మెలో పాల్గొనున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మె చేయనున్నారు. 12 కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. రైల్వే కార్మికులు, ఉద్యోగులు మినహా మిగిలిన అన్ని విభాగాల కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా వివిధ రంగాల కార్మికులు సమ్మెలో ప్రత్యేక్షంగా పాల్గొననున్నారు. వీరితోపాటు సుమారు 20వేల మంది బీడీ కార్మికులు పాల్గొంటున్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎఫ్‌టీయూ, టీఎఫ్‌టీయూ సంఘాలు సమ్మెలో పాల్గొంటాయి.
బస్సులు, ఆటోలు బంద్
సమ్మెలో భాగంగా ఆర్టీసీ బస్సులతోపాటు ఆటోలు బంద్ కానున్నాయి. రోడ్టు ట్రాన్స్‌పోర్టు, రోడ్డు భద్రత బిల్లుకు వ్యతిరేకంగా ఆర్టీసీ, ఆటో కార్మికులు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి. ఈ బిల్లుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లాలో 8డిపోల్లో 840 బస్సులు రోడ్డెక్కడం లేదు. మోటారు, వాహన చట్టంతో కఠినమైన నిర్ణయాలు అమలులోకి రానున్నట్లు తెలిపారు. ప్రమాదాలకు కారణమైన వారి లైసెన్స్‌లు రద్దు, భారీ జరిమాన వంటి నిర్ణయాలను రానున్న కొత్త చట్టంలో పొందుపరచనున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తు ఆటోలు బంద్ పాటిస్తున్నాయి. సమ్మెపై ఐదు రోజులుగా పట్టణంలో ప్రచారం నిర్వహించారు.
అమలుకు నోచుకోవడం లేదు
ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు ఏ ఒక్కటి అమలుకు నోచుకోవడం లేదు. రూ.18వేల వేతన చట్టం అమలు కావడం లేదు. రైస్, ఆయిల్ మిల్ కార్మికుల ఎలాంటి ఉద్యోగ భద్రత, కనీస వేతన చట్టాలు అమలు కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న కొత్త కార్మిక చట్టం వల్ల కార్మికుల హక్కులు హరించుకుపోతాయి.
– సి. వెంకటేశ్, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి
కనీస వేతనం అమలు చేయాలి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి రూ.18వేల కనీస వేతనం అమలు చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఎక్కడ అమలు కావడం లేదు. దాన్ని అమలు చేయాలి. అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
– కొండన్న, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి
కార్మికుల డిమాండ్లు
– నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించి ఆదుపులో పెట్టాలి.
– కనీస వేతనం నెలకు రూ. 18 వేలుగా నిర్ణయించాలి.
– కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, వారిని రెగ్యులరైజ్ చేయాలి.
– సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి.
– అసంఘటిత రంగం, వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి.
– కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.
– కార్మిక చట్టాల సవరణను ఆపి ఉన్న వాటిని పకడ్బందీగా అమలు చేయాలి.
– కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఆమ్మకాన్ని ఆపాలి.
– రక్షణ , రైల్వే, బ్యాంక్ ఇన్సురెన్స్ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించరాదు.
– రోడ్డు ట్రాన్స్‌పోర్డు, విద్యుత్ చట్టసవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలి.
– కార్పొరేట్లకి అనుకూలంగా తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలి.
– పీఎఫ్, ఈఎస్‌ఐ, బోనస్ చట్టాలు విధిగా అమలు చేయాలి.
– అర్హులైన కార్మికులకు పింఛన్ ఇవ్వాలి.
– 45 రోజుల్లోగా కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
Advertisement
Advertisement