కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా కాపు సద్భావనా సంఘం శుక్రవారం జిల్లా బంద్
కాపు సద్భావనా సంఘం పిలుపు
ముద్రగడ అరెస్టుకు నిరసన
కాకినాడ సిటీ / అమలాపురం : కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అరెస్టుకు నిరసనగా కాపు సద్భావనా సంఘం శుక్రవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు, రైళ్ళు నిలుపుదల చేసి ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని సంఘం ప్రధాన కార్యదర్శి బసవా ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
బంద్ నిర్వహణలో కాపు నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా కోనసీమ వ్యాప్తంగా జరిగే ఈ బంద్‌కు వ్యాపార సంఘాలు, వ్యాపారులు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోనసీమ కాపు సంఘం అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ కోరారు. కోనసీమ అంతటా దుకాణాలు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అమలాపురం పట్టణంతో పాటు కోనసీమలోని 16 మండలాల తెలగ బలిజ కాపు (టీబీకే) సంఘాల ప్రతినిధులు బంద్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.
బంద్ వైఫల్యానికి పోలీసుల యత్నం
కాగా బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 144, 30 సెక్షన్లు అమలులో ఉండటం వల్ల దుకాణాలు బంద్ చేయించేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు స్వేచ్ఛగా దుకాణాలు తెరుచుకోవచ్చని, పోలీసులు రక్షణగా ఉంటారని, ప్రజలు కూడా మార్కెట్ అవసరాలకు రావచ్చని అమలాపురం పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. బంద్ పిలుపుతో పట్టణంతో పాటు మండల కేంద్రాల్లో కూడా పోలీసు బలగాలను మోహరించారు.